‘ఆఁఖో మై తేరీ… అజబ్ సీ అజబ్ సీ అదాయీ హై’ ‘ఓం శాంతి ఓం’ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొణెను చూస్తూ హీరో షారుక్ ఖాన్ మైమరచిపోయి ఈ పాట అందుకుంటాడు. ‘నీ కళ్లలో ఒక వింత ఆకర్షణ దాగి ఉంది’ అని ఆ పాత్రను పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఆ వింత ఆకర్షణ దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంది. ఎంతలా అంటే.. ఆమెను పొడుగుకాళ్ల సుందరి అని పిలుచుకొని మురిసిపోతుంటారు కొందరు. ఆమె సొట్టబుగ్గలను తలచుకొని పొంగిపోతుంటారు ఇంకొందరు. అలా పిలుచుకున్నవాళ్లు, తలచుకున్నవాళ్లు మరింత పొంగిపోయేలా దీపిక కెరీర్ సాగింది. ఆమె కీర్తి కిరీటంలో మరో రత్నం వచ్చి చేరింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్-2026లో దీపిక చోటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటి అనిపించుకుంది.
2007లో ‘ఓం శాంతి ఓం’ రిలీజైనప్పుడు ఈమెలో ఏముంది అనుకున్నారంతా! ఏదో ఉందనుకుంది ఇండస్ట్రీ!! ఇండస్ట్రీ మాటే నెగ్గింది. సినిమాలో దీపిక ఉంటే చాలు అనుకునేంత వరకు వెళ్లింది. అల్లరి పాత్రలు ఎంత అలవోకగా చేయగలతో.. భారమైన రోల్స్ కూడా అంతే లోతుగా పోషించగలదు అన్న కీర్తి సంపాదించుకుంది. అంతకుముందు కన్నడలో ఓ చిత్రం చేసినా.. ప్రేక్షకులకు గుర్తున్న మొదటి సినిమా ‘ఓం శాంతి ఓం’ మాత్రమే!!
దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొణె టెన్నిస్ క్రీడలో దిగ్గజంగా పేరుగాంచాడు. ఆయన వారసురాలిగా టెన్నిస్ రాకెట్ అందుకోలేదామె! నటనలో పెద్దగా శిక్షణ తీసుకున్న దాఖలాలూ లేవు. స్టూడెంట్ డేస్ నుంచి మోడలింగ్‌పై ఉన్న మక్కువ దీపికను సినిమాల వైపు అడుగులు వేయించింది. మొదటి సినిమాతోనే బాలీవుడ్ బాద్ షా షారుక్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలోనే అభినేత్రి పాత్ర పోషించింది దీపిక. యాక్టింగ్‌లో ఆరితేరిన నటిగా, అస్సలు యాక్టింగ్ తెలియని పెంకిఘటంగా రెండు పాత్రలు పోషించింది. ఈ రెండో పాత్రకు షారుక్ అండ్ కో యాక్టింగ్‌లో తెగ శిక్షణ ఇస్తూ ఉంటారు. వాళ్లకు మాత్రం అప్పుడేం తెలుసు.. దీపిక ప్రపంచం మెచ్చదగ్గ నటి అవుతుందని. సినిమానే కావొచ్చు! కానీ, అలా డిఫరెంట్ పాత్రలతో మొదలైన కెరీర్లో దీపిక ఎక్కువపాళ్లు విజయాలే రుచి చూసింది.
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఒకరోజు తాను కుంగుబాటుకు గురయ్యానని దీపిక మీడియా ముందు వెల్లడించింది. చాలామంది ఆశ్చర్యపోయారు. అంత స్టార్డమ్ ఉన్న నటికి కుంగుబాటేమిటీ? అని దీర్ఘాలు తీశారు. 2014 వరకు వరుస విజయాలు పలకరించినా తెలియని బాధతో దీపిక మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలూ తనలో రేకెత్తాయి. ఎవరికీ చెప్పుకోలేక తన తల్లితో బాధను పంచుకుంది. ఆమెను గట్టిగా హత్తుకొని ‘నాకు బతకాలని లేదు.. చనిపోవాలని ఉంది..’ అంటూ భోరున విలపించింది. పని, ఒంటరితనం, స్టార్డమ్, లైఫ్‌స్టయిల్ ఇవన్నీ దీపికను తెలియకుండానే కుంగదీశాయి. అమ్మ ఓదార్పుతో కాస్త కుదుటపడింది.
మానసిక నిపుణులను సంప్రదించి ఏడాదిలోనే మళ్లీ మామూలు మనిషైంది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని దీపిక ఓపెన్‌గానే పంచుకుంది. ఒత్తిడికి గురవుతున్న వారికి అండగా ఉండటానికి ‘ద లివ్ లవ్ లాఫ్’ అనే స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించింది. ఇటీవల ప్రధానమంత్రి నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొన్న దీపిక.. తనకు ఎదురైన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకుంది. ఒత్తిడిని జయించడం మినహా మార్గం లేదనీ చెప్పుకొచ్చింది. కుటుంబసభ్యుల సహకారం, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఎలాంటి మానసిక సంక్లిష్ట పరిస్థితుల్లోంచి అయినా బయటపడొచ్చనీ, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణ అని చెప్పుకొచ్చింది.
చాలెంజింగ్ పాత్రలు పోషించడానికి దీపిక ఎప్పుడూ ముందుంటుంది. ఆమె కెరీర్ ప్రారంభంలో వచ్చిన ‘లవ్ ఆజ్ కల్’, ‘కాక్టెయిల్’, ‘యే జవానీ హై దివానీ’ సినిమాలు ఈ కోవకే చెందుతాయి. షారుక్, దీపికా హిట్ పెయిర్‌గా ముద్రవేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు సింహభాగం విజయం అందుకున్నాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘జవాన్’, ‘పఠాన్’ మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. షారుక్ తర్వాత హీరో రణ్వీర్ సింగ్‌తో ఆన్‌స్క్రీన్‌పై దీపికా అదరహో అనిపించుకుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రామ్‌లీల’ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది అప్పుడే! తర్వాత ‘బాజీరావ్ మస్తానీ’తో మరోసారి తమ కెమిస్ట్రీ సూపర్ అని నిరూపించుకుందీ జంట. వీరిద్దరు ప్రధాన పాత్రలు పోషించిన ‘పద్మావత్’ దీపిక కెరీర్లో మైలురాయిగా నిలిచింది.
2018లో రణ్వీర్, దీపిక వివాహం చేసుకున్నారు. పెండ్లి తర్వాత కూడా దీపిక జోరు తగ్గలేదు. పెండ్లికి ముందు ఏ స్పీడుతో సినిమాలు చేసేదో.. తర్వాత కూడా అంతే వేగంగా చిత్రాలు చేసింది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కథ ఆధారంగా 2020లో వచ్చిన ‘చపాక్’ సినిమాలో దీపిక నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ‘83’ సినిమాలో తన భర్త రణ్వీర్తో కలిసి మళ్లీ స్క్రీన్ పంచుకుంది. ఆ చిత్రంలో రణ్వీర్ క్రికెట్ దిగ్గజం, 1983లో క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ కపిల్‌దేవ్ పాత్ర పోషిస్తే.. కపిల్ భార్య రోమీ పాత్రలో దీపిక తళుక్కున మెరిసింది. హాలీవుడ్‌లోనూ హస్తాక్షరం చేసింది. 2017లో ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ చిత్రంతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సొట్టబుగ్గల సుందరి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి తెలుగులో ఎప్పుడు నటిస్తుందా అని ఎదురు చూశారంతా? ఏళ్ల నిరీక్షణకు దర్శకుడు నాగ్ అశ్విన్ తెరదించాడు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి దీపిక నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. తెలుగువారికి దీపికను మరింత దగ్గర చేసింది. కల్కి సినిమాలో దీపిక చాలాభాగం గర్భిణిగానే కనిపిస్తుంది. ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఆమె నిజంగానే గర్భిణి. ఆ సినిమా విడుదలైన మూడునెలలకు దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి దువా పదుకొణె అని పేరు పెట్టుకున్నారు.
మొత్తంగా దీపిక జీవితంలో సినిమాలో ఉన్నన్ని ట్విస్టులు లేకపోయినా… ఆమె బయటికి చెప్పుకొన్న సమస్యనైతే ఎదుర్కొంది. ఆ ఇక్కట్లను ఆత్మైస్థెర్యంతో ఎదుర్కొని.. తారగా గెలిచింది. ఇప్పుడు వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌గా మెరవనుంది.
అమెరికా లాస్ ఏంజెలెస్‌లోని ఓ వీధిలో రోడ్డు పక్కన, నడిచే బాట మీద 2800 నక్షత్రాకారాలు అమర్చి ఉంటాయి. టెరాజో, ఇత్తడి కలయికగా వీటిని తయారుచేస్తారు. టెరాజో అంటే మార్బుల్, గ్రానైట్, క్వార్జ్, గాజుముక్కల్లాంటి వాటి కలయికతో రూపొందించిన ప్రత్యేకమైన టైల్ లాంటిది. అక్కడి హాలీవుడ్ ప్రాంతంలోని బూలెవాడ్, వైన్ వీధుల్లో 1960 నుంచి శాశ్వత ప్రాతిపదికన వీటిని అమర్చారు. వీటిమీదే అంతర్జాతీయ సినిమాలకు సంబంధించి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, సంగీత దర్శకుల పేర్లు చెక్కి ఉంటాయి. కనీసం అయిదేండ్ల కాలం సినిమాల్లో ఉండి, విలువైన సేవలు అందించిన వారికి ఈ నక్షత్రాలను ఇస్తారు.
ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులై ఉండటం, దానధర్మాల్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడంలాంటివీ దీనికి కొలమానాలే. ఇక, ఈ ఏడాది తొలిసారిగా భారత్ నుంచి దీపికా పదుకొణె ఈ అరుదైన గౌరవానికి ఎంపికైంది. ఈ అవార్డును పొందడానికి సదరు నటీనటులు కానీ లేదా స్పాన్సర్లు కానీ సుమారు 73 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. హాలీవుడ్ హిస్టారిక్ ట్రస్ట్ ఆ వీధిలో నక్షత్రాలను ఏర్పాటుచేసి, నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు
ఈ మొత్తాన్ని వినియోగిస్తుంది.