అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ ఏం మాట్లాడినా అది కాస్త వివాదాస్పదమవుతున్నది. ఇటీవలకాలంగా వరుసగా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నుంచి ఈ భామ వైదొలగడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అందుక్కారణం ఆమె చిత్ర నిర్మాతల ముందుంచిన ఎనిమిది గంటల పని నియమం అని ప్రచారం జరిగింది.
తాజాగా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది దీపికా. ఎన్నో సంవత్సరాలుగా చాలా మంది అగ్ర హీరోలు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తున్నారని, ఆ విషయం అందరికీ తెలుసునని చెప్పింది. ‘చాలా మంది హీరోలు వారంలో కేవలం ఐదు రోజులే పనిచేస్తారు. వారాంతాల్లో విరామం తీసుకుంటారు. ఈ విషయం పెద్ద రహస్యమేమీ కాదు. ఇప్పుడు సదరు హీరోల పేర్లు చెప్పదలచుకోలేదు. అలా చేస్తే మళ్లీ వివాదాలు మొదలవుతాయి.
ఏం జరిగినా సరే నేను ఆత్మాభిమానాన్ని మాత్రం తాకట్టు పెట్టను. నేను ఎన్నో సంఘర్షణలను నిశ్శబ్దంగా భరించాను. వాటిపై ఎప్పుడూ స్పందించలేదు. నిశ్శబ్దంగా యుద్ధాలు చేయడం నాకు అలవాటే. అది నాకు గౌరవప్రదంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది దీపికా పడుకోన్. ‘స్పిరిట్’ ‘కల్కి-2’ చిత్రాల నుంచి ఆమెను తప్పించడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై పలు వేదికల్లో పరోక్షంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నది దీపికా పడుకోన్.