నాని హీరోగా నటించిన సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘ఓరి వారి.. నీది గాదుర పోరి’ అనే పాటను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ…‘నాకు బాగా ఇష్టమైన పాట ఓరి వారి. నేను నమ్మే ఫిలాసఫీకి దగ్గరగా ఉండే పాట ఇది. మీ అందరి జీవితాల్లోనూ ఎప్పు డో ఒకసారి బ్రేకప్స్ జరిగి ఉంటాయి.
మార్చి 30 తర్వాత నా మీద మీకున్న ప్రేమ, మీ మీద నాకున్న ప్రేమ పదింతలు అవుతుందని ఆశిస్తున్నా. నీది కాదురా పోరి అన్న తర్వాత మనం అక్కడితో వదిలేయాలి. ఇంకో అమ్మాయి మన కోసం ఎక్కడో ఉండే ఉంటుంది. ఈ పాటకు శ్రీమణి అందమైన సాహిత్యాన్ని అందించాడు. ఇది విజువల్‌గా నా కెరీర్లో బెస్ట్ సాంగ్ అవుతుంది. మా సినిమాను ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌తో పోల్చినప్పుడు కొందరు అంత కలెక్షన్స్ చేస్తుందా అని విమర్శలు చేశారు. వాటిలా దసరా కూడా మన ఇండస్ట్రీ గర్వించదగిన సినిమా అవుతుందనే అర్థంలో నేను ఆ మాట చెప్పాను. ఇప్పటికీ ఆ మాట మీద నిలబడతాను.’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పాల్గొన్నారు.