Darshan Thoogudeepa | రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడ పోలీసు కస్టడీ గురువారంతో ముగియగా పోలీసులు ఇద్దరిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులను ఈ నెల 11న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దర్శన్ సహా మరికొందరు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు రెండురోజుల కస్టడీకి అనుమతించింది. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేసిన పోలీసులు.. 118 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. అయితే, ఇందులో కొందరి విచారణ జరపాల్సి ఉందని.. ఈ క్రమంలో కస్టడీకి మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయమూర్తి అంగీకరించారు.
దర్శన్, వినయ్, ప్రదోష్, నాగరాజ్, లక్ష్మణ్, ధన్రాజ్లను తిరిగి పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రిమాండ్కు దరఖాస్తు చేసుకున్నారు. మిగతా నిందితులు పవిత్ర గౌడ, పవన్, రాఘవేంద్ర, నందీశ్, జగదీశ్, అనుకుమార్, రవిశంకర్, దీపక్, కేశవమూర్తి, నిఖిల్ నాయక్ జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దర్శన్ కస్టడీ పిటిషన్ పొడగింపుపై నటుడి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే పదిరోజుల పాటు విచారించారన్నారు. నిందితులు కొందరు దర్యాప్తునకు సహకరించడం లేదని.. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందాల్సి ఉందని.. ప్రస్తుతం దర్యాప్తు పెండింగ్లో ఉందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయమూర్తి రెండురోజుల కస్టడీకి అనుమతించారు.