Hero Nani | ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ కె రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువై పోయి లవ్‌స్టోరీస్ మిస్ అవుతున్నాం. ఆ లోటును ఈ సినిమా తీరుస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ అదిరిపోయింది. ఈ కథ వినగానే కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమైంది. ప్రియదర్శి నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. ‘హాయ్ నాన్న’ షూటింగ్ టైమ్‌లో గోవాలో నాకు అద్భుతమైన కంపెనీ ఇచ్చాడు. అతని నటన, ఎంచుకునే పాత్రలు చాలా బాగుంటాయి. ప్రియదర్శి అమాయకత్వంలో మంచి అల్లరి ఉంటుంది. ‘బలగం’ సినిమా చూసి ఆయన ఫ్యాన్ అయిపోయా. నా సొంత నిర్మాణ సంస్థలో ప్రియదర్శితో ఓ సినిమా చేయబోతున్నా’ అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ ‘ఈ జనరేషన్ హీరోల్లో నేను నానిని స్ఫూర్తిగా తీసుకుంటా. ప్రతిభ ఉంటే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా ఇండస్ట్రీలో రాణించవొచ్చని ఆయన నిరూపించారు. ‘డార్లింగ్’ అద్భుతమైన కథ. ఇందులోని కొత్తదనం బాగా నచ్చింది’ అన్నారు. ‘ఇది నాకు సినిమా కాదు. ఒక ఎమోషన్. చాలా టఫ్ టైమ్‌లో ఉన్నప్పుడు ఈ అవకాశం వచ్చింది. డ్రీమ్‌రోల్ చేశాననే సంతృప్తి మిగిలింది’ అని నభా నటేష్ చెప్పింది. టీమ్ అందరి సహకారంతో సినిమా అద్భుతంగా వచ్చిందని నిర్మాత చైతన్య రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.