Dangal | బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమీర్‌ఖాన్ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో రూపొందిన తారే జమీన్ పర్ 2007లో విడుదలై సంచలన విజయం సాధించింది.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన సినిమా సితారే జమీన్ పర్ . 2018లో స్పానిష్ ఛాంపియన్స్ మూవీ ఆధారంగా హిందీలో రూపొందించిన ఈ సినిమాకు దివ్య నిధి శర్మ కథ అందించగా R. S. ప్రసన్న దర్శకత్వం వహించాడు. ఈ మూవీని అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించాడు. జెనీలియా దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించింది. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘దంగల్’ పాకిస్తాన్లో ఎందుకు విడుదల కాలేదన్న అంశంపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. పాక్ లో దంగల్ సినిమా విడుదల కావాలంటే వారు రెండు షరతులు పెట్టారు. మన జాతీయ గీతం, జాతీయ జెండాను మూవీ నుంచి తొలగించాలని అక్కడి సెన్సార్ బోర్డు చెప్పడంతో నేను దానికి ఏ మాత్రం అంగీకరించలేదు. గీతా ఫోగట్ మ్యాచ్ గెలిచిన సన్నివేశంలో భారత జెండాతో పాటు జాతీయ గీతం ఉంటుంది. ఆ రెండింటిని తొలగిస్తినే ఈ చిత్రానికి అనుమతి ఉంటుందని పాక్ సెన్సార్ చెప్పింది. దీంతో వెంటనే నేను మా సినిమా పాకిస్తాన్ లో విడుదల కాదని చెప్పాను.
పాకిస్తాన్ విడుదలను రద్దు చేయడం వల్ల కలెక్షన్స్ విషయంలో కాస్త ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్మాతలు నాతో చెప్పారు. అయినప్పటికీ, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేనికీ మద్దతు ఇవ్వకూడదని స్పష్టంగా ఆరోజే చెప్పాను అని అమీర్ ఖాన్ అన్నారు. సినిమా విడుదల వల్ల డబ్బు వస్తుంది, కానీ దేశ ప్రయోజనాల విషయంలో మేము రాజీ పడం. దేశానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయానికీ మేము ఒప్పుకోము. ఇది నా ఒక్క నిర్ణయమే కాదు, అందరం కూడా అదే అభిప్రాయంతో ఉన్నామని అమీర్ స్పష్టం చేశారు. 2016లో విడుదలైన ‘దంగల్’ చిత్రం భారత రెజ్లింగ్ చాంపియన్స్ అయిన ఫోగాట్ సిస్టర్స్ జీవితం ఆధారంగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ₹2,000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం చైనాలో కూడా ఘన విజయం సాధించింది. కానీ పాకిస్తాన్లో మాత్రం రాజకీయ కారణాల వలన విడుదల కాలేదు