‘కలర్ ఫొటో’ ‘బెదురులంక-2012’ వంటి వినూత్న కథా చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్టైన్స్ సంస్థ తాజాగా తెలంగాణ నేపథ్య ఇతివృత్తంతో ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత.
బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాహు గారపాటి క్లాప్‌నివ్వగా, ఎస్కేఎన్ కెమెరా స్విఛాన్ చేశారు. ‘తెలంగాణ గ్రామీణ నేపథ్య కథాంశమిది. మన పురాతన ఆచారాలు, సంప్రదాయాలను ఆవిష్కరిస్తుంది. చక్కటి హాస్యంతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలుంటాయి’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్ శాఖమూరి, సంగీతం: మార్క్ కె రాబిన్, దర్శకత్వం: మురళీకాంత్.