గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సందడి చేసిన వెంకటేశ్, మొన్న సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’తో కలిసొచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీనే సృష్టించారు. ఈ రెండు విజయాలకూ పాత్రధారి వెంకీ అయితే.. ప్రధాన సూత్రధారి మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్లుగా సంక్రాంతిని లక్ష్యంగా చేసుకొని ఈ ధ్వయం విజయాలను అందుకుంటూనే ఉంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతిని సైతం టార్గెట్ చేసింది. అందరూ అనుకున్నట్టు ఇది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ కాదు.
ఇదొక బావ – బావమరిదుల కథ.. వదినా మరదళ్ల మధ్య వారిద్దరూ ఎలా నలిగిపోయారు? ఈ క్రమంలో వారిద్దరి ఫ్రెస్ట్రేషన్ ఏంటి? అనే ప్రశ్నల చుట్టూ అల్లుకున్న కామెడీ కథ ఇది. అందుకని ఇదేం ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీలో భాగం కానే కాదు. ఇదొక కొత్త కథ. ఇందులో బావ – బావమరిదులుగా వెంకటేశ్, ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నారు. ఇక వదినా, మరదళ్లు ఎవరో తేలాలి. సాహు గారపాటి, సురేశ్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం రానున్న సంక్రాంతికి వినోదాల విందు చేయడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.