Bala Krishna | హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన ఒక చిన్న ఎమోజీ పోస్ట్ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌కు కారణమైంది. దాదాపు నెలన్నర పాటు సాగిన ఈ వివాదంపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు క్షమాపణలు చెబుతూ, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని అభిమానులను కోరారు. బాలయ్య అభిమానులు కూడా ఆయన వివరణతో శాంతించారు. సీవీ ఆనంద్ తన తాజా పోస్టులో రెండు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తుచేస్తూ, ఒక ఎమోజీ కారణంగా బాలకృష్ణ అభిమానులు, ఆయన విమర్శకులు పరస్పరం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌కు దిగారని, ఆ గొడవలో భాగంగా తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.
నగరానికి సంబంధించిన సంఘటనలు, కేసుల వలన వెంటనే స్పందించలేకపోయానని చెప్పారు. సెప్టెంబర్ 29న జరిగిన ఒక ప్రెస్ మీట్ అనంతరం, బాలయ్యకు సంబంధించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఎమోజీ పెట్టడం పూర్తిగా అనవసర నిర్ణయమని ఆయన అంగీకరించారు. ఆ పోస్ట్ వివాదానికి దారి తీసిందని తెలుసుకున్న వెంటనే దానిని తొలగించానని, వివరాలు తెలుసుకున్న తర్వాత బాలకృష్ణకు స్వయంగా మెసేజ్ పంపి క్షమాపణలు చెప్పానని వెల్లడించారు. బాలయ్యతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగానని, వారందరితో తనకు మంచి స్నేహం, గౌరవం ఉన్నట్లు చెప్పారు.
సీవీ ఆనంద్ మాట్లాడుతూ, తాను పెట్టిన ఎమోజీ పోస్ట్‌తో పాటు మరో కొన్ని తప్పుడు పోస్టులను చేసిన సోషల్ మీడియా హ్యాండ్లర్‌ను ఇప్పటికే తొలగించానని, అందుకే గత నెలలో తన అకౌంట్లలో చాలా తక్కువ పోస్టులు కనబడుతున్నాయని చెప్పారు. సమయం లేకపోవడం వల్ల ప్రతిదానికి వెంటనే స్పందించలేకపోతున్నానని తెలిపారు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని అభిమానులను అభ్యర్థించారు. అసలు వివాదం ఎలా మొదలైందంటే దాదాపు నెలన్నర క్రితం సీవీ ఆనంద్ సినీ ప్రముఖులతో మూవీ పైరసీ, డిజిటల్ లీకేజీ, బెట్టింగ్ యాప్‌లపైనా జరిగిన ఒక కీలక మీటింగ్ గురించి పోస్ట్ చేశారు. ఆ మీటింగ్‌కు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, నాగచైతన్య, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. దీనిని చూసిన ఒక బాలయ్య అభిమాని “మా బాలకృష్ణను మీటింగ్‌కు ఎందుకు పిలవలేదు? ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతారు” అని కామెంట్ చేశాడు. దానికి సీవీ ఆనంద్ నవ్వుతున్న ఎమోజీతో స్పందించడం బాలయ్య అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ రాజుకుంది. ఈ వివాదంపై ఇప్పుడు క్షమాపణ చెబుతూ, ఇరువర్గాలు శాంతించాలని కోరడంతో ఈ వ్యవహారం పూర్తిగా ముగిసినట్లైంది.