Teja Son | సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజ (Amitov Teja) పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బెదిరింపులు, డబ్బు వసూలు, కిడ్నాప్, అక్రమ నిర్బంధం, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులు నమోదు కావడం సినీ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మోతీనగర్‌కు చెందిన కె. ప్రణీత్ బ్యాంకు క్రెడిట్ కార్డుల పర్యవేక్షణ రంగంలో పనిచేస్తున్నారు. 2025లో క్రెడిట్ కార్డు దరఖాస్తుల విషయమై అమితోవ్ తేజతో ప్రణీత్‌కు పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే అమితోవ్ తేజ, ప్రణీత్, అతని భార్య కలిసి షేర్ మార్కెట్లో ఒక అకౌంట్ తెరిచి ట్రేడింగ్ ప్రారంభించారు.
ప్రణీత్ తేజ తరఫున ట్రేడింగ్ నిర్వహించగా, అందులో సుమారు రూ.11 లక్షల నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు మరింత డబ్బు పెట్టాలని అమితోవ్ తేజ ప్రణీత్‌పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రణీత్ నిరాకరించడంతో పరిస్థితి తీవ్రంగా మారినట్లు చెబుతున్నారు.ప్రణీత్ ఫిర్యాదు ప్రకారం, 2025 మే 4న అమితోవ్ తేజ అనుచరులు మణికుమార్, రామ్‌నాథ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి .. ప్రణీత్‌ను అక్రమంగా నిర్బంధించారు. ఈ సందర్భంగా ఖాళీ పేపర్లు, చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించడమే కాకుండా, అతని భార్యతో ఆస్తి కాగితాలపై కూడా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో, ప్రణీత్ రెండు నెలల క్రితం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విషయాన్ని పరిశీలించిన కోర్టు, కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అమితోవ్ తేజతో పాటు అతని అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, ఇదే ట్రేడింగ్ వ్యవహారంలో పెట్టుబడి పేరిట ప్రణీత్, అతని భార్య తనను రూ.72 లక్షలు మోసం చేశారని అమితోవ్ తేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జూబ్లీహిల్స్ పోలీసులు ఇరవై రోజుల క్రితం మరో కేసు నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే.ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఇరు పక్షాల ఆరోపణలతో కేసులు నమోదవడం, నిజానిజాలపై దర్యాప్తు కొనసాగుతుండటంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.