“మిస్సింగ్’ సినిమాలో గౌతమ్ అనే యువకుడిగా నా పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే తపనతో చేసిన సినిమా ఇది’ అని అన్నారు హర్ష నర్రా. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్సింగ్’. శ్రీని జోస్యుల దర్శకుడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరిరావు నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో హర్ష నర్రా పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘అక్కినేని యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నా. దివంగత నటుడు ఏఎన్నార్ నుంచి అవార్డు అందుకున్నా. ‘ఆకాశమంత ప్రేమ’ అనే షార్ట్ఫిలిమ్ నాకు మంచి పేరుతెచ్చిపెట్టింది. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ, పెళ్లిగోల వెబ్‌సిరీస్‌లలో నటించా. శ్రీనిజోస్యుల చెప్పిన కథ నచ్చి ఈ సినిమా అంగీకరించా. ఫ్యామిలీ అందరితో కలిసి చూసే చిత్రమిది. ఇందులో గౌతమ్‌గా భిన్న పార్శాలతో నా పాత్ర సాగుతుంది. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా అతడి భార్య కనిపించకుండా పోతుంది. ఆమెను వెతుకుతూ గౌతమ్ సాగించే ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. ఈ జర్నీలో తనను తాను ఎలా తెలుసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథలోని కొత్తదనం నచ్చడంతో మా నాన్నశేషగిరిరావు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు. నటుడిగా ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా అన్ని రకాల కథలతో సినిమాలు చేస్తా’ అని తెలిపారు.