Gautham Vasudev Menon | ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కి మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన ప్రొడక్షన్ హౌస్ ఫోటాన్ ఫ్యాక్టరీ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. అంతేకాదు, ఈ కేసులో ముందుగా ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఆర్.ఎస్. ఇన్ఫోటైన్మెంట్కు రూ. 4.25 కోట్లు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు మూలాలు 2008 నవంబర్ 27కి సంబంధించినవి. ఆ సమయంలో ఫోటాన్ ఫ్యాక్టరీ సంస్థ, ఎల్రెడ్ కుమార్‌కు చెందిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్తో ప్రొడక్షన్ నెం.6 సినిమా కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2009 ఏప్రిల్ 5 నాటికి సినిమా పూర్తి కావాల్సి ఉంది.
నిర్మాత ఎల్రెడ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం పలు విడతల్లో మొత్తం రూ. 4.25 కోట్లు చెల్లించారు. అయితే నిర్ణీత గడువులో సినిమా ప్రారంభం కాలేదు. దీంతో అదనంగా 2010 ఫిబ్రవరి 12 వరకు గడువు ఇచ్చినా, ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో, 2013లో నిర్మాత కోర్టును ఆశ్రయించారు. ఒప్పందం ప్రకారం సినిమా పూర్తి కాలేదని, చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పందంలో పేర్కొన్నట్లుగా 24 శాతం వడ్డీతో చెల్లించాలని కూడా కోర్టుకు వివరించారు.ఈ కేసులో గౌతమ్ మీనన్ తరఫున, తాము తీసిన ‘నీతానే ఎన్ పొన్వసంతం’ (తెలుగులో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’) చిత్రమే ఆ ఒప్పందం కింద రూపొందించామని వాదించారు. కాబట్టి తమ బాధ్యత పూర్తయిందని కోర్టుకు తెలిపారు.
అయితే ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. ఆ సినిమా వేరే ఒప్పందం కింద రూపొందిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో గౌతమ్ మీనన్, ఆయన సంస్థ కలిసి రూ. 4.25 కోట్లు 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.తాజాగా డివిజన్ బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రాగా, అప్పీల్‌ను పూర్తిగా తిరస్కరించింది. గత తీర్పును యథాతథంగా నిలబెట్టింది. అలాగే కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజుల కింద అదనంగా రూ. 12 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది.ఈ తీర్పుతో, దాదాపు దశాబ్దానికి పైగా కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది. గౌతమ్ మీనన్‌కు ఇది భారీ ఆర్థిక భారంగా మారగా, నిర్మాతకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నారు.