AM Ratnam | పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరి హర వీరమల్లు. ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానున్నది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తెరకెక్కించారు. తమకు బకాయిలు ఉన్నారని.. వాటిని వసూలు చేయించాలని రెండు సంస్థలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC)లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి రెండు సినిమాల విషయంలో ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన బకాయిలను ఆయన ఇప్పటి వరకు చెల్లించలేదని రెండు సంస్థలు ఆరోపించాయి. ‘ఆక్సిజన్’ మూవీకి సంబంధించి రూ.2.5 కోట్ల రికవరీ కోసం ఏషియన్ ఎంటర్ప్రైజెస్, అలాగే ‘ముద్దుల కొడుకు’,‘బంగారం’ చిత్రాలకు సంబంధించిన రూ.90వేల రికవరీ కోసం మహాలక్ష్మీ ఫిల్మ్స్ ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.
హరి హర వీరమల్లు మూవీ విడుదలకు ముందే తమ బకాయిలు వసూలు చేయాలని రెండు సంస్థలు కోరాయి. అయితే, ఈ విషయంలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు సహకరించాలని కోరడంతో పాటు ఫిల్మ్ ఛాంబర్ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. అయితే, పవన్ సినిమా విడుదలకు సమయం పడుతున్న నేపథ్యంలోనే వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. హరిహర వీరమల్లు మూవీ రెండు పార్టులుగా రానున్నది. తొలి పార్ట్-1 24న విడుదల కానున్నది. హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్నది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.