సినీరంగంలో పురుషాధిక్యతపై తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్ భామ కృతిసనన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను ఈ ఇంటర్వ్యూలో ఆమె గుర్తు చేసుకున్నది. ‘సినిమాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదట్నుంచీ నాకెక్కువే. ఫలానా సన్నివేశం ఇలా చేస్తే బావుంటుందని చెప్పాలనుంటుంది. కానీ ఇక్కడ హీరోయిన్లకు అంత సీన్ లేదు. ఓసారి ఓ దర్శకుడికి ఇలాగే సలహా ఇచ్చేందుకు ప్రయత్నించా. ఆయన ఇరిటేటవుతూ ‘మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావ్.. చెప్పింది చెయ్’ అన్నారు. నా మనసు చివుక్కుమన్నది. అదే సలహా హీరోలు ఇస్తే, ‘ఆహా.. ఓహో..’ అంటూ మెచ్చుకుంటారు.
సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్లు ఎక్కడెక్కడ పాల్గొనాలో కూడా ఇక్కడ హీరోలే నిర్ణయిస్తారు. నాకు ఎదురైన మరో చేదు అనుభవం ఇది. నాకంటూ నిర్ణయాధికారం లేనప్పుడు, ఆ ప్రమోషన్లేవో వారే చేసుకోవచ్చుకదా.. అనిపించి, నేను రానని గట్టిగా చెప్పేశాను. కానీ దర్శక,నిర్మాతలు బతిమాలడంతో తప్పక ప్రమోషన్స్‌లో పాల్గొన్నా. ప్రస్తుతం ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించేందుకు హీరోయిన్లెవరూ ఇష్టపడటంలేదు. నచ్చిన పాత్రల్నే ఎంచుకుంటున్నారు. అయినా ఇక్కడ ఇంకా పురుషాధిక్యతే కొనసాగుతున్నది’ అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్.