Vijay | తమిళ నటుడు విజయ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందే లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో కోయంబత్తూరు జిల్లా (గ్రామీణ) పోలీసులు సోమవారం (ఏప్రిల్ 13, 2026) ఒక కేబుల్ టీవీ ఆపరేటర్‌ను అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, కరుమతంపట్టి ప్రాంతానికి చెందిన ఎస్. పళనిసామి (44) అనే వ్యక్తి స్థానికంగా ‘రాసి కేబుల్ టీవీ నెట్వర్క్’ నిర్వహిస్తున్నాడు. ఈయనపై తమిళగ వెట్రి కళగం కార్యకర్త మోహనప్రియ ఫిర్యాదు చేయడంతో ఆదివారం (ఏప్రిల్ 12) కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఏప్రిల్ 11 రాత్రి ‘రాసి ప్రైమ్ మూవీస్’ అనే స్థానిక కేబుల్ ఛానల్లో ‘జన నాయగన్’ సినిమా లీక్ అయిన వర్షన్‌ను ప్రసారం చేసినట్లు ఆరోపించారు. ఇంటర్వల్ తర్వాత సుమారు 21 నిమిషాల పాటు సినిమా ప్రసారం చేసినట్లు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే TVK కార్యకర్తలు అక్కడికి చేరుకుని ప్రసారాన్ని అడ్డుకున్నారు.
సమాచారం అందుకున్న కరుమతంపట్టి పోలీసులు వెంటనే కేబుల్ నెట్వర్క్ కార్యాలయానికి చేరుకుని ప్రసారాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం నిందితుడిపై కాపీరైట్ చట్టం, సమాచార సాంకేతిక చట్టం, సినిమాటోగ్రాఫ్ చట్టం, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరికల్ పారి శంకర్ నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి నాలుగు హార్డ్‌డిస్కులు, ఒక వ్యక్తిగత కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టామని, సినిమా లీక్ వర్షన్ నిందితుడికి ఎలా అందిందనే అంశంపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కరుమతంపట్టి, తెక్కలూరు, సూలూర్ ప్రాంతాల్లో ఈ కేబుల్ నెట్వర్క్ సేవలు అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సినిమా విడుదలకు ముందే లీక్ కావడం చిత్రబృందానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది. కాగా, విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ సంక్రాంతికే విడుదల కావలసి ఉండగా, పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఇది విజయ్ చివరి చిత్రంగా చెబుతున్నారు. మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, పలు కారణాల వలన చిత్రం పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.