రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపించినా తెలుగు సినీరంగాన్ని అభిమానంతోనే చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సినీరంగం అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణంగా తోడ్పాటునందిస్తుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకున్నప్పటికి, హైదరాబాద్‌లో తెలుగు సినీరంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
తెలుగు సినీరంగంలో ప్రతిభావంతులకు పట్టం కడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. ప్రజాకవి, వాగ్గేయకారుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన ఈ సినీ పురస్కార ఉత్సవానికి తెలుగు తారాలోకం తరలివచ్చింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జ్యోతిప్రజ్వలనతో ఈ వేడుకను ఆరంభించారు. తెలంగాణ సంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఈ వేడుక ఆసాంతం సందడిగా సాగింది. 2024 ఏడాదిగాను అన్ని విభాగాలకు, 2014-23 సంవత్సరాలకుగాను ఉత్తమ చిత్రాలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు.
‘పుష్ప-2’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని స్వీకరించారు అల్లు అర్జున్. ‘కల్కి’ చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా నాగ్అశ్విన్, ‘35 చిన్న కథకాదు’ చిత్రానికి ఉత్తమ నటిగా నివేదా థామస్, ‘రజాకార్’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో పురస్కారాలను అందుకున్నారు. బాలకృష్ణ (ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు), మణిరత్నం (పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు), సుకుమార్ (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు), అట్లూరి పూర్ణచంద్రరావు (నాగిరెడ్డి-చక్రపాణి ఫిల్మ్ అవార్డు), విజయ్ దేవరకొండ (కాంతారావు ఫిల్మ్ అవార్డు), యండమూరి వీరేంద్రనాథ్ (రఘుపతి వెంకయ్య అవార్డు) పురస్కారాలను అందుకున్నారు.
14ఏండ్ల క్రితం వరకూ జరిగిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలనే ప్రతిపాదనను సినీ పరిశ్రమ ప్రముఖులు, ముఖ్యంగా దిల్‌రాజు తమ దగ్గరకు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కొనసాగించిన ఒక మంచి సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగిస్తుందుకు ఆనందంగా ఉందన్నారు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన అవార్డులను మళ్లీ పునరుద్ధరించాలనే సంకల్పంతో గద్దర్ ఫిల్మ్ అవార్డులకు శ్రీకారం చుట్టామని సీఎం వివరించారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం ఆయన ప్రసంగించారు. హాలీవుడ్, బాలీవుడ్‌లకు ధీటుగా హైదరాబాద్‌లో సినీరంగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.
‘కాంగ్రెస్ పార్టీ సినీ పరిశ్రమకు ఎప్పుడూ అండగా నిలుస్తుంది. గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. తెలుగు సినిమా అంటే చెన్నయ్‌లో ఉంది అన్నట్లు మాట్లాడుకునేవారు. ఇప్పుడు భారతీయ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి వెళ్లింది. ఐటీ, ఫార్మసీతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా గొప్ప స్థాయికి చేరాలి. ఇదే మా సంకల్పం. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డపైనే ఉండాలి. ఫిల్మ్ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తాం. మేం క్రియేట్ చేయబోతున్న విజన్ డాక్యుమెంట్లో ఒక చాప్టర్‌ను సినీపరిశ్రమకు కేటాయిస్తున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్ కేటగిరీని ప్రస్తావించలేదు. ఫిల్మ్ క్రిటిక్ అవార్డుకు అర్హులు ఎవరూ లేరు కాబట్టి కేవలం పుస్తకానికి ఇస్తామని తెలిపారు. కానీ ఆశ్చర్యంగా అవార్డుల ప్రదానోత్సవానికి ఒకరోజు ముందు ఫిల్మ్ క్రిటిక్ అవార్డును పొన్నం రవిచంద్రకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్వయాన మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు కావడంతో అవార్డుల ఎంపికలో ఎన్ని అవకతవకలు జరిగాయో అనే విమర్శలొచ్చాయి. సోషల్‌మీడియాలో కూడా ఈ విషయంపై చర్చ జరుగుతున్నది.
దేశం గర్వించదగ్గ గొప్ప కళాకారుడు గద్దరన్న. కళారంగంలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం. ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకన్న గొప్ప కళాకారుడాయన. ఆయన పేరిట సినీ అవార్డులందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారకరామారావుగారికి ఘన నివాళులర్పిస్తున్నా. అభివక్త ఆంధ్రరాష్ట్రంలో నంది అవార్డును స్థాపించడం జరిగింది. రాష్ట్రం రెండుగా మారాక, తెలంగాణ రాష్ట్రం, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డును స్థాపించడం ముదావహం. ఇందులో భాగంగా నా తండ్రి నందమూరి తారకరామారావు పేరిట నెలకొల్పిన జాతీయ పురస్కారం నేనందుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం గౌరవార్థకంగా అందించిన ఈ నగదు బహుమతిని మా బసవతారకం కేన్సర్ హాస్పిటల్‌కి అందిస్తున్నా.’
-బాలకృష్ణ
మనం ఎక్కడెక్కడ ఏం సాధించినా మన నేలమీద ఇలాంటి వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నన్ను అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
– చంద్రబోస్
‘తెలుగు సినీ కళాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్‌లను స్థాపించింది. ఈ తొలి అవార్డు వేడుకలో తొలి ఉత్తమ నటుడ్ని నేను కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నాకిచ్చిన ప్రభుత్వానికి థాంక్స్. సుకుమార్‌గారి వల్లే నాకీ అవార్డు వచ్చింది. రాజమౌళిగారు ఈ సినిమాను హిందీలో విడుదల చేయమని చెప్పకపోతే ‘పుష్ప’ సిరీస్ ఈ స్థాయి వచ్చేది కాదు. ‘పుష్ప2’ చిత్ర యూనిట్‌కి కృతజ్ఞతలు. ఈ అవార్డును నా అభిమానులకు అంకితమిస్తున్నా
-అల్లు అర్జున్
గద్దరన్న పేరు మీద ఈ అవార్డులు మొదలుపెట్టి ఇండస్ట్రీని ఒక్క దగ్గరకు తీసుకురావడం ఆనందంగా ఉంది. మహబూబ్‌నగర్‌లో పుట్టిన పిల్లోడినైన నాకు కాంతారావు వంటి లెజెండరీ నటుడి పురస్కారాన్ని అందించడం, ఇది తీసుకున్న మొదటి వ్యక్తిని నేను కావడం నాపై మరింత బాధ్యత పెంచింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
-విజయ్ దేవరకొండ