CM Revanth | అల్లు అర్జున్ వ్యవహారంలో సినీ ప్రముఖులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీ వేదికగా స్పందించారు. హీరోను పీఎస్‌కు తీసుకెళ్తుంటే కొందరు నేతలు నన్ను తిడుతూ పోస్టులు పెట్టారన్నారు. రూ.30వేల ఉద్యోగం చేసుకునే వ్యక్తి రూ.12వేలతో సినిమా టికెట్లు కొని సినిమాకు వెళ్లారని.. కుమారుడు అల్లు అర్జున్ అభిమాని అని సినిమాకు తీసుకెళ్లాడన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బాధ్యతా రహితంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు.
11 రోజుల వరకు బాధిత కుటుంబం వద్దకు హీరో, నిర్మాత వెళ్లలేదని.. బాధిత కుటుంబాన్ని హీరో, నిర్మాత పరామర్శించలేదన్నారు. ఒక్క రోజు హీరో జైలుకు వెళ్లి వస్తేనే.. సినిమావారంతా ఇంటికి పరామర్శలకు క్యూ కట్టారని.. అల్లు అర్జున్‌కు ఏమైనా కన్ను పోయిందా..? కాళ్లు పోయాయా? చేతులు పోయినవా..? కిడ్నీలు కరాబైనయా? ఎందుకు వెళ్లారు? అక్కడ ఒక తల్లి చనిపోయింది.. కొడుకు బ్రెయిన్‌డెడ్‌తో ఆసుపత్రిలో ఉన్నడు.. ఒక్కరైనా పరామర్శకు వెళ్లివచ్చారా? ఆయన టాలీవుడ్ ప్రముఖులపై మండిపడ్డారు. తాను సినిమా ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నానన్నారు. అమానవీయ ఘటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి.. డబ్బులు సంపాదించుకోవాలన్నారు.
ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోవాలని.. షూటింగ్‌లకు సంబంధించిన ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. నేను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలు జరుగనివ్వన్నారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని.. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు.