తొలినాళ్లలో యూత్‌కి నచ్చే సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లే ఎక్కువ చేసేవారు నాని. స్టార్డమ్ పెరగడంతో యాక్షన్ సినిమాల బాట పట్టారాయన. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సుజిత్ సినిమా ఉంటుంది. ఇవన్నీ యాక్షన్ ఎంటర్టైనర్లే. అయితే.. తాజాగా సమాచారం ప్రకారం త్వరలో నాని ఓ క్లాసిక్ ప్రేమకథలో కనిపించబోతున్నారట. 96, సత్యం సుందరం వంటి ఫీల్‌గుడ్ సినిమాలను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలిసింది.
కార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్లో ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ‘సత్యం సుందరం’ నానికి చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమా విడుదలైనప్పుడు సదరు దర్శకుడిని ఎంతగానో ప్రశంసించారాయన. రీసెంట్గా నానికి ప్రేమ్‌కుమార్ ఓ కథ వినిపించారట. కథ నచ్చడంతో నాని కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. అయితే.. నాని ఓకే చెప్పినా.. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే సెట్స్పైకెళ్లే అవకాశం లేదు. ‘ది ప్యారడైజ్’, సుజిత్ సినిమా.. ఈ రెండూ పూర్తయ్యాకే ఈ తాజా సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అటుఇటుగా 2027 మిడిల్లో ఈ సినిమా మొదలవ్వొచ్చని ఓ అంచనా.