స్టార్టప్ కంపెనీలకు అండగా నిలుస్తున్న టీ హబ్‌లో శుక్రవారం సినీ ప్రెన్యూర్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీ హబ్ సీయీవో యం. శ్రీనివాసరావు, ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలుగు ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీస్కూల్ – సినీ ప్రెన్యూర్ ఫౌండర్ డైరెక్టర్ ప్రతిభ పులిజల మాట్లాడుతూ…‘టీ హబ్‌లో మొదలైన సినిమా స్టార్టప్ సినీ ప్రెన్యూర్. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలనుకునే వారికి ఒక వారధిగా మా సంస్థ సహకరిస్తుంది. మా స్టార్టప్‌లో కోర్సు పూర్తి చేసిన 11 మంది గ్రాడ్యుయేట్స్‌కు ఇవాళ సర్టిఫికెట్లు ప్రధానం చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు. టీ హబ్ సీయీవో యం.శ్రీనివాసరావు మాట్లాడుతూ…‘టీ హబ్ ద్వారా త్వరలో సినీ పరిశ్రమకు సంబంధించిన 24 విభాగాల వారికోసం లక్షా యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రీన్ మ్యాట్, విజువల్ ఎఫెక్టుల స్టూడియో రూపొందిస్తున్నాం’ అన్నారు.