ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ఎంవీ రఘు భారతీయ సినిమా పరిశ్రమలో 50ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థాన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై, చిత్రసీమకు ఎంవీ రఘు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 1974లో కెరీర్ మొదలుపెట్టిన ఎంవీ రఘు.. స్వాతిముత్యం, సిరివెన్నెల, సితార, అన్వేషణ తదితర ఆల్‌టైమ్ క్లాసిక్స్‌కు ఛాయాగ్రహణం అందించారు. 1988లో ఆయన దర్శకత్వం వహించిన ‘కళ్లు’ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.
ఆ సినిమాతో ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇదిగాక 4 నంది అవార్డులు కూడా ఆ సినిమాకు వరించాయి. అద్భుతమైన క్రియేటివిటీ ఉన్న ఛాయాగ్రాహకుడు ఎంవీ రఘు అనీ, ఎందరో గొప్పగొప్ప దర్శకులతో పనిచేసిన ఘనత రఘు సొంతమని నటుడు తనికెళ్ల భరణి కొనియాడారు. సినీపరిశ్రమకు ఎంవీ రఘు చేసిన కంట్రిబ్యూషన్ అద్భుతమని సుమన్ పేర్కొన్నారు. ఎం.వి.రఘు మాట్లాడుతూ ‘ఈ 50ఏండ్ల కెరీర్లో ఎందరో మహానుభావులతో పనిచేశాను. ‘లవకుశ’ సినిమాటోగ్రాఫర్ పీఎల్ రాయ్, ‘మాయాబజార్’ రూపొందించిన మార్కస్ భాట్లే, నా గురువు వీఎస్ఆర్ స్వామి, ఎస్.గోపాల్‌రెడ్డి వీరందరితో పనిచేశాను.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కె.విశ్వనాథ్ వంటి లెజెండ్ల సినిమాలకు డీవోపీగా వర్క్ చేశాను. వీరంతా నన్ను సహకరించినవారే. మన దేశం నుంచి ఆస్కార్ దాకా వెళ్లిన తొలి సినిమా కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’. దానికి సినిమాటోగ్రాఫర్ నేనే . ఒక ఛాయాగ్రాహకుడిగా నేను ఏదైనా సాధించాను అంటే అందులో డైరెక్టర్ వంశీ పాత్ర కీలకం. ప్రస్తుతం ఈ తరం పిల్లలకు సినిమాటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నాను. ఇది నాకెంతో ఆనందాన్నిస్తున్న అంశం.’ అన్నారు. ఇంకా మురళీమోహన్, దర్శకుడు వీరశంకర్, సినిమాటోగ్రాఫర్స్ ఎస్.గోపాల్‌రెడ్డి, చోటా కె.నాయుడు, పీజీ విందా, నటులు ఉత్తేజ్, శివాజీరాజా, నటి అన్నపూర్ణ తదితరులు మాట్లాడారు.