తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మిక దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, దర్శకుడు ఎన్ శంకర్, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్టార్ హీరో చిరంజీవి వీడియో సందేశం ద్వారా సినీ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్‌కు ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ పీఎస్ఎన్ దొర ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి పనిచేసిన 24 విభాగాల సాంకేతిక నిపుణులు, కార్మికులను సత్కరించారు.
ఈ సినిమా పాటల రచయిత చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్‌లకు సన్మానం చేశారు. సినీ కార్మికులకు పెంచిన వేతనాల ఒప్పంద పత్రాలను ఫిలించాంబర్ నుంచి ఫెడరేషన్‌కు అందజేశారు. పాతికవేల మంది సినీ కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని, తమకు సినిమా పరిశ్రమ పెద్దలు పూర్తి సహకారం అందిస్తున్నారని అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తున్నదని, తమ సమస్యలను ఎఫ్డీసీ దృష్టికి తీసుకురావొచ్చని ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం చెప్పారు.