Chiranjeevi | ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి, చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారత జట్టు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి, నైపుణ్యం పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో అతనిపై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో.. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై టీమిండియా చూపించిన ప్రదర్శన అద్భుతం. టీమ్ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి, నైపుణ్యం, సంయమనం మెచ్చుకోవల్సిందే. ప్రత్యేకంగా తిలక్ వర్మకు అభినందనలు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణం” అని తెలిపారు.
టాలీవుడ్ హీరో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా భారత జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ పెట్టారు. టీమ్ ఇండియా మరోసారి తమ సత్తా చూపించింది. తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది. జట్టు సమష్టికృషితోనే ఈ చారిత్రక విజయం సాధ్యమయ్యింది అని అన్నారు. ఇది మన భారతదేశానికి ముందస్తు దసరా కనుక. దీన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేయగా, ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళ, మలయాళ సినీ తారలు కూడా భారత జట్టును అభినందించారు. మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్, తదితరులు భారత జట్టు విజయాన్ని మెచ్చుకున్నారు. మమ్ముట్టి మాట్లాడుతూ, “టీమిండియా కేవలం ఆసియా కప్ గెలవడమే కాకుండా, అన్ని మ్యాచ్‌లలో పకడ్బందీగా ఆధిపత్యం చూపించింది. ఇది వారి అసాధారణ సామర్థ్యాన్ని నిరూపిస్తుంది” అని పేర్కొన్నారు.యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ విజయం భారత క్రికెట్‌కి గర్వకారణం. తిలక్ వర్మ మంచి ఆటగాడు, అతని ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది అంటూ అభినందనలు తెలిపారు.