Chiranjeevi |మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇటీవల చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఏ చిత్రం కూడా పెద్దగా ప్రేక్షకులని అలరించలేకపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్తో పాటు బలమైన ఎమోషన్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రవితేజ పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన స్వరంతో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
సినిమాలో కీలకమైన సందర్భాల్లో రవితేజ పాత్ర గురించి వచ్చే వాయిస్ ఓవర్‌ను చిరంజీవి చెప్పనున్నారని, ఇది కథకు మరింత వెయిట్ పెంచడమే కాకుండా సినిమాపై బలమైన ముద్ర వేయబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి వాయిస్ ఓవర్ ఉండటం వల్లే సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కుల డీల్స్ కూడా భారీ ధరకు పూర్తయ్యాయి. ప్రముఖ జీ గ్రూప్ ఈ సినిమా హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా స్ట్రీమింగ్కు రానుండగా, శాటిలైట్ ప్రసారాన్ని జీ తెలుగు మరియు జీ సినిమా ఛానల్స్ నిర్వహించనున్నాయి.
జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ మ్యూజిక్‌పై ఉన్న క్రేజ్‌కు తోడు రవితేజ ఎనర్జీ, కిశోర్ తిరుమల కథనం కలిసి ఈ సినిమాను హిట్ ట్రాక్‌లో నిలబెడతాయనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అంశాలతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సిద్ధమవుతోందని, రిలీజ్ దగ్గరపడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.