చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు అంచనాల్ని రెట్టింపు చేశాయి. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా చిత్ర దర్శకుడు వశిష్ట సినిమా తాలూకు కథా వివరాల్ని వెల్లడించారు. ‘మనకు మొత్తం 14లోకాలున్నాయి. పైన ఏడు, కింద ఏడు ఉంటాయి. ఇప్పటివరకూ ఈ 14 లోకాలను ఎవరికి తోచిన విధంగా వాళ్లు చూపించారు. యమలోకం, స్వర్గ, పాతాళలోకం..ఇలా అన్నింటినీ చూశాం. ‘విశ్వంభర’లో నేను వీటన్నింటినీ దాటి పైకి వెళ్లా. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని చూపించా. 14 లోకాలకు అదే ఆధారం.
కథానాయకుడు ఆ లోకానికి వెళ్లి నాయికను ఎలా తిరిగి తెచ్చుకుంటాడన్నదే సినిమా కథ’ అని వశిష్ట తెలిపారు. రెండున్నర గంటల సినిమాలో రెండు గంటలు గ్రాఫిక్సే ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్మీడియాలో వైరల్గా మారింది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.