Chiranjeevi| మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. యూకే పార్లమెంటులో అక్కడి ఎంపీల సమక్షంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం జరగడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవిని బ్రిటన్ చట్టసభ వేదికగా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో గౌరవించిన నేపథ్యంలో చిరంజీవిపై అభినందనల వర్షం కురుస్తోంది. బ్రిడ్జి ఇండియా సంస్థ ఒక వ్యక్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అలాంటి అరుదైన సందర్భంలో చిరంజీవి కి ఆ అవార్డు రావడం నిజంగా ఎంతో ప్రత్యేకమే కాదు.. అసాధారణ గౌరవం కూడా.
తనకి ఈ గౌరవం దక్కడం పట్ల చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఈ గౌరవం తనని మరింత ఉత్సాహంగా పని చేయడానికి ప్రేరేపిస్తుందని తెలిపారు.. ఈ గౌరవం దక్కడం పట్ల నాకు మాటలు రావడం లేదు. అద్భుతమైన ప్రేమాభిమానాలను చూపించే అభిమానులు, రక్త దాతలు , నా సినీ కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అందరూ నా ప్రయాణంలో ఎంతగానో సహకరించిన వారు, నేను మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంతో పని చేయడానికి ప్రేరేపిస్తుంది. నాపై మీ కున్న ప్రేమ, అభిమానాన్ని చూపిస్తూ అందరూ ఎన్నో అభినందన సందేశాల ను పంపారు. వారందరికీ ప్రేమతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి లండన్ పర్యటనలో గోల్మాల్ జరిగింది. ఆయన టూర్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేశారు కొందరు కేటుగాళ్లు . ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను కలవడానికి ఎవరూ డబ్బులు కట్టక్కర్లేదని ట్వీట్లో తెలిపారు . ఎవరైనా డబ్బులు వసూలు చేసి ఉంటే తిరిగి ఇచ్చేయాలని , అభిమానాన్ని ఎవరూ కొనలేరంటూ చిరు భావోద్వేగ పోస్ట్ పెట్టారు. లండన్ లో తనను కలవాలని మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత తనను ఎంతగానో కదిలించిందంటూ చిరు తన ట్వీట్ లో తెలిపారు