Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సంక్రాంతి చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా తీసుకుని రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు మెగాస్టార్–అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. అభిమానులు థియేటర్ల దగ్గర క్యూలు కడుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ సీజన్ కావడంతో టికెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వెంకటరమణ థియేటర్లో జరిగిన టికెట్ వేలం సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వేలంలో మెగా అభిమాని వెంకట సుబ్బారావు ఏకంగా రూ.1.11 లక్షలు వెచ్చించి ప్రత్యేక టికెట్‌ను సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ సినిమాకు సంబంధించిన తొలి షోను, ప్రత్యేకంగా చూడాలనే ఉత్సాహంతో ఈ మొత్తాన్ని ఖర్చు చేశానని ఆయన తెలిపారు. చిరంజీవిపై ఉన్న అపారమైన అభిమానానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది.ఇలాంటి సంఘటనలు మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువు చేస్తున్నాయి. గతంలోనూ చిరంజీవి సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ వేలాలు, భారీ ధరలకు బుకింగ్స్ జరగడం చూశాం. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది.
సినిమా విషయానికి వస్తే.. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి మాస్‌తో పాటు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించనున్నారని టాక్. అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్, ఎమోషన్, కమర్షియల్ అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. మొత్తానికి, రిలీజ్‌కు ముందే టికెట్‌కు లక్షల రూపాయల బిడ్డింగ్ జరగడం చూస్తుంటే.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో బిగ్ విన్నర్ అవుతుందనే అంచనాలు మరింత బలపడుతున్నాయి.