IND vs PAK | భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది. దాయాదీల పోరును చూసేందుకు సగటు ప్రేక్షకులు టీవీల ముందు అతుక్కుపోతారు. క్రికెట్ ప్రేమికులు అయితే రెక్కలు కట్టుకుని మరీ మ్యాచ్ జరిగే స్టేడియంలో వాలిపోతారు. ఎంత డబ్బు అయినా సరే వెచ్చించి మరీ లైవ్‌లో మ్యాచ్ చూడాలని ఆరాటపడతారు. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ అలాంటి పరిస్థితే రిపీట్ అయ్యింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి, సుకుమార్ సహా పలువురు సెలబ్రెటీలు దుబాయి వెళ్లి మరీ లైవ్‌లో మ్యాచ్ వీక్షించారు.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీవీలో ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి స్టేడియంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. చిరంజీవి కాకుండా ఇంకా ఎవరెవరు సెలబ్రెటీలు దుబాయి వెళ్లారని తెలుసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, రాజ్యసభ సభ్యుడు సాన సతీశ్ దుబాయి స్టేడియంలో కనిపించారు. వీరు టీమిండియా జెర్సీ ధరించి కనిపించారు. ఇక చిరంజీవితో కలిసి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి మ్యాచ్‌ను తిలకించారు.