Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా మారింది. ఆయన తన సినీ ప్రయాణాన్ని 1978లో ప్రారంభించి, 47 ఏళ్లుగా ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయారు. తన తొలి చిత్రం “ప్రాణం ఖరీదు” విడుదలై నేటికి సరిగ్గా 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిరంజీవి ఒక భావోద్వేగ ట్వీట్ చేశారు. “22 సెప్టెంబర్ 1978… కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే నేను ‘చిరంజీవిగా’ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. అప్పటి నుంచి నన్ను అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా ఆదరించిన మీ అందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. ఈ ప్రేమే నన్ను 155 సినిమాలపాటు నడిపించింది. మీ ప్రేమానురాగం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.” అని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా చిరంజీవి సినీ ప్రస్థానాన్ని సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఘనంగా గుర్తు చేసుకుంటున్నారు. చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా పరిశ్రమలోకి ప్రవేశించి, స్టార్ హీరోగా, మెగాస్టార్‌గా, తర్వాత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు సమానంగా పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు.ఈ 47 ఏళ్లలో చిరంజీవి ఎన్నో అవార్డులు, గౌరవాలు, అభిమానాన్ని సంపాదించారు. కానీ ఆ ప్రతిష్ఠలు తనకే కాదు, ప్రేక్షకుల ప్రేమకు ఫలంగా భావిస్తూ… “అవి మీ అందరివే” అని చెప్పిన మెగాస్టార్ వినమ్రత అందరిని హత్తుకుంది.
ఇక ఈ విశిష్ట ఘట్టాన్ని పురస్కరించుకుని #47YearsOfChiranjeeviEra అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అభిమానులు చిరంజీవి సినీ కెరీర్‌లోని గుర్తుండిపోయే సన్నివేశాలను, పాటలను, డైలాగ్‌లను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి కెరీర్ ఇప్పటికీ నిలకడగా కొనసాగుతోంది. ఆయన సినీ ప్రయాణం సినీ ప్రేమికులకు ఒక గర్వకారణం. అభిమానులు కోరేది ఒక్కటే మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ అదే ఉత్సాహంతో, అదే ఎనర్జీతో అందరినీ అలరిస్తూ కొనసాగాలి అని. ప్రస్తుతం చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. మరోవైపు విశ్వంభర చిత్రంతో పలకరించనున్నారు.
22 సెప్టెంబర్ 1978
‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025