2023 అక్టోబర్‌లో ఆకాశమంత అంచనాలతో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ మొదలైంది. ‘జగదేకవీరుడు- అతిలోకసుందరి’ స్థాయిలో సినిమా ఉంటుందని మేకర్స్ కూడా నమ్మకం వెలిబుచ్చారు. ఈ ఏడాది జనవరిలోనే సినిమాను విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ అది జరగలేదు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్లో సీజీ వర్క్ పేలవంగా ఉందని విమర్శలు రావడంతో ‘విశ్వంభర’కు కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే కథ రీత్యా ‘విశ్వంభర’లో సీజీ వర్క్ చాలా ప్రధానం. దాదాపు గంటకు పైగా ఈ సినిమాలో గ్రాఫిక్ వర్కే ఉంటుందట. దాంతో సీజీ విషయంలో మేకర్స్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమెరికాకు చెందిన ప్రముఖ స్టూడియోస్కి ‘విశ్వంభర’ సీజీ వర్క్ బాధ్యతను అప్పగించారు.
ఎట్టకేలకు ఈ సినిమా సీజీ వర్క్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తున్నది. తాజాగా 45 నిమిషాల గ్రాఫిక్స్ వర్క్‌ని ఇటీవలే చిరంజీవి చూసి, ఔట్పుట్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారట. ఓ పాట, ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా పూర్తయింది. ఆ మిగిలిన వర్క్‌ని వీలైనంత త్వరగా ముగించాలని చిరంజీవి యూనిట్‌కు సూచించారట. సెప్టెంబర్ 18న ‘విశ్వంభర’ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్కి వశిష్ట మల్లిడి దర్శకుడు. త్రిష కథానాయిక. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.