Telugu Heroes | అప్పట్లో ఒకడుండేవాడు.. ఆరడుగుల ఆజానుబాహుడు.. టాలీవుడ్‌కు సరిగ్గా పునాదులు పడకముందే.. బాలీవుడ్లో రాజ్యమేలాడు. ఆయనే మన తెలంగాణ బంగారం.. పైడి జైరాజ్. దాదాపు 156 హిందీ చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించాడు. మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించాడు. జైరాజ్ తర్వాత బాలీవుడ్ కోటలో ఆయనలా పాగా వేసిన తెలుగు నటుడు మరొకరు లేరు. పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్నా.. మన హీరోలు గ్లోబల్‌స్టార్ ఇమేజ్ సంతరించుకుంటున్నా.. బాలీవుడ్‌పై పట్టు సాధించింది తక్కువే! మళ్లీ చాలా ఏండ్లకు ఎన్టీఆర్ డైరెక్ట్ హిందీ సినిమా ‘వార్-2’ మల్టీస్టారర్‌లో హీరోగా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కన్నేసిన మన హీరోల ముచ్చట్లు చర్చించుకుందాం..
‘బాహుబలి’ వచ్చింది. తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లింది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైంది. తెలుగు సినిమా గ్లోబల్ అయింది. ఇంటా, బయటా రచ్చ చేసిన సినిమాలెన్నో టాలీవుడ్లో ఇటీవల పుట్టుకొస్తున్నాయి. అయినా, మన హీరోలు వాళ్లకు డబ్బింగ్ స్టార్లే! పైడి జైరాజ్ తర్వాత ఐదారుగురు హీరోలు డైరెక్ట్ హిందీ చిత్రాలు చేసినా.. ఆయనకు వచ్చినంత గుర్తింపు వీరికి రాలేదనే చెప్పాలి. మూకీ సినిమాల్లో మొదలైన జైరాజ్ ప్రభంజనం టాకీలు వచ్చాక కూడా కొనసాగింది. హేమాహేమీ దర్శకుల నేతృత్వంలో మరపురాని సినిమాల్లో నటించాడు. టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ ఇలా చారిత్రక పాత్రలెన్నో ధరించాడు. పృథ్వీరాజ్‌కపూర్, రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ లాంటి ఉద్దండ నటులను మించి కలెక్షన్లూ కొల్లగొట్టాడు. బాలీవుడ్ సినీపల్లకీలో ఊరేగిన ఈ మహానటుడి చరిత్రను టాలీవుడ్ గుర్తించకపోవడం మన దౌర్భాగ్యమే!
తెలుగు సినిమా చక్రవర్తి, నవరస నటనా సార్వభౌముడు ఎన్టీఆర్ మూడు హిందీ సినిమాల్లో నేరుగా నటించాడు. ఆయన్ను మాస్ హీరోగా నిలబెట్టిన ‘పాతాళ భైరవి’ హిందీలోనూ విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, భానుమతి నటించిన ‘చండీరాణి’ కూడా హిందీ వెర్షన్లో వచ్చింది. ఈ సినిమా పోస్టర్లో ‘రిలీజింగ్ ఆల్ ఓవర్ ఇండియా’ అని ప్రకటించారు. ఆ లెక్కన 1953లోనే టాలీవుడ్ నుంచి తొలి పాన్ ఇండియా సినిమా వచ్చినట్టయింది. ఎన్టీఆర్ నటించిన మూడో హిందీ చిత్రం 1956లో విడుదలైన ‘నయా ఆద్మీ’. ఇందులో జమున, అంజలీదేవి కథానాయికలుగా నటించారు. సీపీ దీక్షిత్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలన్నీ షూటింగ్ సమయంలోనే తెలుగు, హిందీ రెండు వెర్షన్లలో నిర్మించారు. ఎన్టీఆర్ నటించిన చిత్రరాజం ‘లవకుశ’ హిందీలోకి డబ్ అయింది.
తెలుగు సినిమాకు రెండు కండ్లు ఎన్టీఆర్, ఏయన్నార్. దాదాపు మూడున్నర దశాబ్దాలు ఈ ఇద్దరూ టాలీవుడ్‌ను సమంగా పాలించారు. అప్పట్లో బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలతో వీళ్లకు సత్సంబంధాలే ఉండేవి. కానీ, ఎందుకో హిందీ సినిమా చేయడానికి అంతగా ఆసక్తి కనబర్చలేదు. వీళ్లు నటించిన పలు సినిమాలు హిందీలోకి డబ్ అయి విజయవంతమయ్యాయి. అక్కినేని, అంజలీదేవి జంటగా నటించిన ‘అల్లావుద్దీన్ అద్భుతదీపం’ సినిమా 1957లో వచ్చింది. ఈ సినిమాను హిందీలో ‘అల్లాద్దీన్ కా చిరాగ్’ పేరిట డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేశారు. అదే ఏడాది తెలుగులో వచ్చిన ‘సువర్ణ సుందరి’ ప్రభంజనం సృష్టించింది.
అక్కినేని, అంజలీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వేదాంతం రాఘవయ్య దర్శకుడు. పి.ఆదినారాయణరావు నిర్మాత, సంగీత దర్శకుడు. ఈ సోషియోఫాంటసీ చిత్రంలో పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఏకకాలంలో తెలుగు, తమిళంలో షూట్ చేశారు. సినిమా విడుదలై అఖండ విజయం సాధించిన తర్వాత హిందీలోకి డబ్ చేద్దాం అనుకున్నారు. అయితే, పలువురు పెద్దలు డబ్బింగ్ కన్నా.. రీమేక్ చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వెలిబుచ్చారు. దీంతో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలోనే హిందీలోనూ పునర్నిర్మించారు. 1958లో రిలీజైన ఈ చిత్రం హిందీలోనూ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. అలా ఏయన్నార్ డైరెక్ట్ బాలీవుడ్ హీరో అనిపించుకున్నాడు.
స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదిగిన నటుడు చిరంజీవి. సౌత్ ఇండియన్ బచ్చన్ అనిపించుకున్నాడు. ఒకానొక దశలో అమితాబ్ కన్నా ఎక్కువ పారితోషికం అందుకున్న హీరోగానూ క్రెడిట్ కొట్టేశాడు. ఇంట ఇంత గెలిచినా.. బాలీవుడ్ గురించి అంతగా పట్టించుకోలేదు చిరంజీవి. ఆయన నటించిన ఎన్నో సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఇతర హీరోలతో హిందీలో రీమేక్ అయ్యాయి. కానీ, చిరంజీవి నేరుగా హిందీలో చేసిన సినిమాలు మూడు మాత్రమే! తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమా ‘ప్రతిబంధ్’ పేరుతో హిందీ రీమేక్ తీశారు. ఈ సినిమాతో మెగాస్టార్ మొదటిసారి బాలీవుడ్లో అడుగుపెట్టాడు. తెలుగు సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తే, హిందీ చిత్రానికి డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి. 1990లో విడుదలైన ‘ప్రతిబంధ్’ ఆశించిన విజయాన్నే అందుకుంది.
1991లో తెలుగులో విడుదలైన బ్లాక్‌బస్టర్ ‘గ్యాంగ్‌లీడర్’. ఈ సినిమా చిరు హీరోగా ‘ఆజ్ కా గూండారాజ్’ పేరుతో మరుసటి ఏడాది హిందీలో విడుదలైంది. తెలుగులో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘గ్యాంగ్‌లీడర్’.. హిందీలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తర్వాత రెండేండ్లకు మరోసారి హిందీ తెరపై మెరిశాడు చిరంజీవి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్‌మ్యాన్’ సినిమా హిందీ రీమేక్ ‘ద జెంటిల్‌మ్యాన్’ లో హీరోగా నటించాడు. మహేశ్‌భట్ దీన్ని డైరెక్ట్ చేశాడు. తమిళంలో, తెలుగులో (డబ్బింగ్) మెగాహిట్ అందుకున్న ‘జెంటిల్‌మ్యాన్’.. హిందీలో ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. తర్వాత మరెన్నడూ డైరెక్ట్ హిందీ చిత్రంలో నటించలేదు మెగాస్టార్. ఆయన హీరోగా ఓ హాలీవుడ్ సినిమా అనుకున్నా.. అది కార్యరూపం దాల్చలేదు.
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటుకున్న నటుడు నాగార్జున. తెలుగులో యువసామ్రాట్, మన్మథుడు, కింగ్ అనిపించుకున్న ఈ హీరో.. హిందీలో నేరుగా పది సినిమాల వరకు నటించాడు. అందులో హీరోగా కొన్ని అయితే.. సహనటుడి పాత్రలోనూ అలరించాడు. నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ కాంబోలో 1989లో వచ్చిన ‘శివ’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి హిందీలోనూ ఆయనే హీరోగా రీమేక్ చేశారు. అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. 1992లో అమితాబ్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుదాగవా’ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్ర పోషించాడు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం, నాగార్జున హీరోగా వచ్చిన ‘అంతం’ హిందీలో ‘ద్రోహి’గా ఏకకాలంలో షూట్ చేశారు. తెలుగులో విజయవంతమైన ‘క్రిమినల్’ సినిమా హిందీలోనూ మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత ‘అంగారే’, ‘జఖ్మ్’, ‘అగ్నివర్ష’, ‘ఎల్వోసీ కార్గిల్’ సినిమాల్లోనూ నాగ్ కీలకమైన పాత్రలు పోషించి బాలీవుడ్ జనాలను మెప్పించాడు. 2022లో సంచలన విజయం సాధించిన ‘బ్రహ్మస్త్ర’లోనూ నాగార్జున ప్రధాన భూమిక పోషించి హిందీ చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
తెలుగులో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెంకటేశ్. సుమారు నాలుగు దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్న ఆయన ముచ్చటగా మూడు హిందీ సినిమాల్లో కనిపించాడు. 1992లో వెంకటేశ్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘చంటి’ సంచలన విజయం సాధించింది. ఇదే సినిమాను ‘అనాడీ’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన ‘యమలీల’ హిందీ రీమేక్ ‘తక్దీర్వాలా’లో వెంకీ కథానాయకుడిగా కనిపించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్నే సాధించింది. మళ్లీ 28 ఏండ్ల వరకు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు వెంకీ. 2023లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు.
దగ్గుబాటి వారసుడు రానాకు బాలీవుడ్లో మంచి క్రేజే ఉంది. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి అడపాదడపా హిందీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. 2011లో ‘దమ్ మారో దమ్’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఏడెనిమిది సినిమాల్లో నటించినా వాటిలో చాలావరకు మల్టీస్టారర్సే ఉన్నాయి. 2012లో ‘డిపార్ట్మెంట్’, 2013లో ‘యే జవానీ హై దీవానీ’, 2015లో ‘బేబీ’, 2017లో ‘ద ఘాజీ అటాక్’, 2019లో ‘హౌస్‌ఫుల్-4’ ఇలా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించాడు.
నందమూరి వారసుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించుకున్నాడు. నటనకు కొత్త భాష్యం చెబుతూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’లో భీమ్‌గా ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ‘దేవర’ కూడా హిందీ బెల్ట్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాల డబ్బింగ్ వెర్షన్లు బాలీవుడ్ జనాలకు దగ్గరయ్యాయి. ట్రిపుల్ ఆర్ ఇచ్చిన జోష్‌తో డైరెక్ట్ హిందీ సినిమాకు ఆయన ఓకే చెప్పాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వార్’ సినిమా 2019లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక వార్-2 అంతకుమించి ఉంటుందని చెబుతున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. హృతిక్ రోషన్‌తో తలపడనున్నాడు. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్ ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ‘వార్-2’ ఈ ఏడాది ఆగస్టులో విడుదల అవుతుందని టాక్.
అమితాబ్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘జంజీర్’. 1973లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. తెలుగులో పెద్ద ఎన్టీఆర్ హీరోగా ‘నిప్పులాంటి మనిషి’ పేరుతో రీమేక్ అయింది. మళ్లీ నలభై ఏండ్ల తర్వాత అదే కథాంశంతో రామ్‌చరణ్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా 2013లో ‘జంజీర్’ విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న రామ్‌చరణ్‌కు నిరాశే ఎదురైంది. అయితే, ఆర్ఆర్ఆర్ హిందీ రీమేక్‌తో హిందీ బెల్ట్‌లో చెర్రీకి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ ఈ శుక్రవారం పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్నది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు రామ్‌చరణ్‌ను డైరెక్ట్ హిందీ సినిమా కోసం సంప్రదిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్లో ఒకసారి వైఫల్యం రుచిచూసిన రామ్ మళ్లీ అక్కడే విజయం చవిచూడాలనుకుంటే.. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ ముందు అదేమంత పెద్ద టాస్క్ కాదేమో!