Chiranjeevi | మహోన్నత వ్యక్తిత్వం, అపారమైన సేవాతత్వంతో కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన వీరాభిమాని రాజేశ్వరి, చిరంజీవిని ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలన్న ఆశతో సైకిల్‌పై హైదరాబాద్‌కి సాహసోపేతమైన యాత్ర ప్రారంభించారు. శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలు ఎదురైనా, చిరు మీద ఉన్న అపారమైన అభిమానమే ఆమెకు బలంగా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ఆమెను స్వయంగా ఆహ్వానించి, తన అభిమానానికి అద్భుతమైన గుర్తుగా చీరని బహుకరించారు. అలానే తన పిల్లల చదువుకి సంబంధించిన బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.
అయితే రాజేశ్వరి, తన పిల్లలతో కలిసి మెగాస్టార్‌ను కలిసిన సమయంలో చిరంజీవికి రాఖీ కట్టి, ఆయనను తన అన్నయ్యలా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ అనుబంధానికి స్పందించిన చిరు, ఆమెకు సాంప్రదాయబద్ధంగా చీరను బహుమతిగా ఇవ్వడం, ఆశీర్వాదాలు అందించడం జరిగింది. తన అభిమానిని భావోద్వేగంతో గుర్తించిన చిరంజీవి, రాజేశ్వరి పిల్లల విద్యా భారం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. వారి భవిష్యత్తు వెలుగుల బాటలో సాగేలా చేయడమే తన బాధ్యతగా భావించారు. అభిమానులను కేవలం అభిమానులుగానే కాకుండా, తన కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి గొప్ప మనసుకు ఇది మరో బలమైన ఉదాహరణగా నిలిచింది.
ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు చిరంజీవి పెద్ద మనసును ప్రశంసిస్తూ, “తెరపై నటన ఒక్కటే కాదు – నిజ జీవితంలోనూ ఆయన ఓ మహానటుడు, మహామనిషి” అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి “విశ్వంభర” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్” చిత్రంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండు సినిమాలూ జెట్ స్పీడ్‌తో షూటింగ్ దశలో ఉన్నట్టు సమాచారం.