Chiranjeevi | అగ్ర నటుడు చిరంజీవికి ద్విపాత్రాభినయం కొత్తేమి కాదు. ఇప్పటికే పలు చిత్రాల్లో ఆయన డ్యూయల్ రోల్లో మెప్పించారు. తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో చిరంజీవి మరోమారు ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ఉగాది సందర్భంగా లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపిస్తారని, ఆయన పాత్ర ఆద్యంతం చక్కటి హాస్యంతో సాగుతుందని చెబుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలి సకుటుంబ వినోదప్రధానంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారని, చిరంజీవి ఇమేజ్‌కి తగినట్లుగా హై ఇంటెన్సిటీ యాక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.