మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ప్రస్తుతం చిరంజీవి, నయనతార, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సోమవారం నుంచి చిరంజీవి, నయనతారలపై ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ పాటను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మంచి మాస్ బీట్తో స్వరపరిచారని, ఈ పాట సినిమాకే హైలైట్ కానున్నదని మేకర్స్ తెలియజేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి రచన: ఎస్.కృష్ణ, జి.ఆది నారాయణ, కెమెరా: సమీర్‌రెడ్డి, సమర్పణ: అర్చన, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, నిర్మాణం: షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటైర్టెన్మెంట్స్.