అగ్ర నటుడు చిరంజీవి, అగ్ర నటి శ్రీదేవి జంటగా నటించిన ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘జగదేకవీరుడు- అతిలోక సుందరి’. 1990 మే 9న విడుదలైన ఆ సినిమా పాత రికార్డులన్నింటినీ తిరగరాసి, కొత్త రికార్డు నెలకొల్పింది. టాలీవుడ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ ఎవగ్రీన్ క్లాసిక్ 35ఏండ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.
మే 9న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. 2డీతోపాటు త్రీడీలోనూ ఈ సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుంది. చిరంజీవి, శ్రీదేవిల నటన, కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, నిర్మాత అశ్వనీదత్ భారీ నిర్మాణ విలువలు ఈ తరం ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేయడం ఖాయమని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.