అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రస్తుతం తన 157వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వినోదభరిత కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. వింటేజ్ చిరంజీవిని ప్రజెంట్ చేస్తూ ఆయన శైలి హాస్యాన్ని మరోసారి ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని అంటున్నారు. ప్రస్తుతం కేరళలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది.
చిరంజీవి, నయనతారలపై ఓ మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరకర్త. పెళ్లి సందడి నేపథ్యంలో వచ్చే ఈ పాట కన్నులపండువగా ఉంటుందని, నిజమైన ఉత్సవాన్ని, ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ నెల 23 వరకు జరిగే ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్‌ను కూడా తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలకానుంది. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.