అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. తాజా షెడ్యూల్లో చిరంజీవిపై ఉపోద్ఘాత గీతాన్ని తెరకెక్కిస్తున్నారు.
హైదరాబాద్ శంకర్పల్లిలో వేసిన భారీ సెట్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నది. కీరవాణి స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. శోబి మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చారు. మాస్ బీట్తో హుషారెత్తించే పాట ఇదని, చిరంజీవి డ్యాన్స్ హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఓ దైవకార్యం నెరవేర్చడానికి భువిపై జన్మించిన ఓ వ్యక్తికి, విశ్వంభర అనే లోకానికి మధ్యన ఉండే సంబంధం, కార్యసాధనలో అతను చేసే ప్రయాణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, రచన-దర్శకత్వం: వశిష్ట.