Chiranjeevi | తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండెపోటుతో ఆయన కన్నుమూయడంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది. భాగ్యరాజ్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకలో భాగ్యరాజ్‌తో గడిపిన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
మొన్న గోవాలో ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకలో మేమంతా కలిసి ఎంతో ఆనందంగా గడిపాం. నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, ఫొటోలు దిగుతూ మంచి సమయాన్ని గడిపాం. భాగ్యరాజ్ గారు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అలాంటి వ్యక్తి ఈ ఉదయం ఇక లేరనే వార్త ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. భాగ్యరాజ్ భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలను చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అద్భుతమైన దర్శకుడు, మంచి స్క్రీన్‌ప్లే రచయిత, గొప్ప నటుడిగా భాగ్యరాజ్ గారు చేసిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి అని ఆయన కొనియాడారు.
తన ప్రత్యేకమైన కథన శైలి, కుటుంబ కథలు, హాస్యం, భావోద్వేగాలను మేళవించే ప్రతిభతో భాగ్యరాజ్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని చిరంజీవి పేర్కొన్నారు. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు చిరంజీవి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పూర్ణిమ గారికి, శాంతనుకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన అన్నారు. చివరగా భాగ్యరాజ్‌ను స్నేహితుడిగా గుర్తు చేసుకుంటూ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. నా ప్రియమైన మిత్రమా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అంటూ ఆయన నివాళులర్పించారు.