 
                                                            Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై సైబర్ నేరగాళ్లు సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలను అధికారులు తొలగించారు. ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో “దయా చౌదరి” పేరుతో ఉన్న ఖాతా నుంచి ఈ వీడియోలు పోస్ట్ చేయబడ్డాయని. ఆ ఖాతాను ఇప్పటికే బ్లాక్ చేయించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు . ఈ వీడియోలు ఎక్కడ నుంచి అప్లోడ్ అయ్యాయో IP అడ్రస్‌ల ద్వారా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది అని తెలిపారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ వీడియోలు విదేశీ IP అడ్రస్‌ల నుంచి అప్లోడ్ అయ్యాయని వెల్లడించారు. అంటే, ఈ నేరంలో అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. డీప్‌ఫేక్ వీడియోల విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్ఠ, గౌరవం దెబ్బతినేలా వ్యవహరించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన పోలీసులను ఆశ్రయించి న్యాయపోరాటం ప్రారంభించారు.ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగించబడుతోంది. కానీ దురదృష్టవశాత్తూ, దానిని దుర్వినియోగం చేసే ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్య కంటెంట్ సృష్టించడం పెరుగుతోంది.
బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రష్మిక మందన్నా, రజినీకాంత్ వంటి పలువురు ఇప్పటికే ఇలాంటి డీప్‌ఫేక్ ఘటనలకు బలయ్యారు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే బారిన పడటం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే సైబర్ నేరగాళ్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. “డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, పోస్ట్ చేయడం తీవ్రమైన నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు” అని స్పష్టం చేశారు. మొత్తం మీద, ఈ ఘటన డీప్‌ఫేక్ టెక్నాలజీ ఎంత ప్రమాదకరంగా మారిందో మరోసారి రుజువు చేస్తోంది. పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
                            