దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని తన 156వ చిత్రానికి శ్రీకారం చుట్టారు అగ్ర నటుడు చిరంజీవి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సోషియో ఫాంటసీ నేపథ్య కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. పంచభూతాల నేపథ్యంలో నడిచే కథ ఇదని గతంలోనే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం దేవ, మానవ, పాతాళలోకం అనే ముల్లోకాల కాన్సెప్ట్ ప్రధానంగా ఈ సినిమా కథ నడుస్తుందని చెబుతున్నారు.
కథానుగుణంగా గ్రాఫిక్స్కు అధిక ప్రాధాన్యత ఉంటుందని, తెరపై ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, సాహిత్యం: శ్రీశివశక్తిదత్తా, చంద్రబోస్, రచన-దర్శకత్వం: వశిష్ట.