cherasala | హారర్ కామెడీ సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన చాలా సినిమాలు తెలుగులో మంచి ఆదరణే లభించింది. తాజాగా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే ‘చెరసాల’. రామ్ ప్రకాశ్ శ్రీజిత్, నిష్కల, రమ్య ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కించింది. ఎస్.రాయ్ క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..
కథ:
వంశీ(శ్రీజిత్), ప్రియ(నిష్కల) ఇద్దరూ ప్రేమికులు. వీరికో ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంటుంది. వీరంతా కలిసి సరదాగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఒకసారి వీరంతా కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్లి గడపాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఓ అందమైన పెద్ద బంగ్లాలో గడిపేందుకు వెళతారు. అక్కడ వారికి అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలోనే ఆ బంగ్లాలో ఓ ఆత్మ ఉందని వాచ్మెన్ ద్వారా తెలుసుకుంటారు. ఇంతకీ ఆ బంగ్లాలో ఉన్న ఆత్మ ఎవరిది? ఆమెను ఎవరు చంపారు? ఆ ఆత్మకు బంగ్లాకు ఉన్న సంబంధమేంటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
భార్యాభర్తలు ఇద్దరూ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? పవిత్రమైన ఆ బంధంలో అనుమానాలు, అపార్థాలకు తావిస్తే ఎలాంటి నష్టం జరుగుతుందనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ పవిత్రమైన స్త్రీ తన మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతటి త్యాగం చేసిందనేది ఇందులో చూపించారు. అయితే దీనికి హారర్ కామెడీని జోడించారు.నిజానికి ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. రొటీన్ స్టోరీ అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు హీరో కమ్ దర్శకుడు రామ్ ప్రకాశ్ గున్నం కూడా అదే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు కామెడీని నమ్ముకున్నాడు. అలాగే యూత్‌ఫుల్ డైలాగ్స్‌తో సినిమాను నడిపించాడు.
ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత వారికి ఎలాంటి సిట్యూయేషన్స్ ఎదురయ్యాయి. ఆ టైమ్‌లో వాళ్ల బాండింగ్ ఎలా ఉందనేది చక్కగా చూపించారు. ఈ క్రమంలో వారి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపించాయి.వీటి కారణంగా ప్రేక్షకులు బోరింగ్‌గా ఫీలవుతారు.నిడివి ఇంకాస్త తగ్గించాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం ఫర్వాలేదనిపించింది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లతో పాటు మరో అరడజను మంది నటీనటులు ఉన్నారు. వీరంతా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. హీరో కమ్ డైరెక్టర్ రామ్ ప్రకాశ్‌కు మంచి పాత్ర దక్కింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జీవించాడు. అతనికి జోడీగా కౌసల్య పాత్రలో రమ్య కూడా ఫర్వాలేదనిపించింది. కన్నడ నటుడు శ్రీజిత్ మెప్పించాడు. ప్రియ పాత్రలో నిష్కల అందంగా కనిపించింది. గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకుంది.
బలాలు
+ కామెడీ
బలహీనతలు
– సాగదీత సన్నివేశాలు
రేటింగ్ 2