Kaantha | ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంత’ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. నవంబర్ 14న విడుదల కాబోయే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కోరుతూ తమిళ నటుడు ఎం.కే. త్యాగరాజ భాగవతార్ మనవడు ఉపాసన సంజీవ్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉపాసన సంజీవ్ తన పిటిషన్లో, ‘కాంత’ సినిమా మా తాత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. కానీ కుటుంబ అనుమతి లేకుండా ఆయన బయోపిక్ తీసినందుకు ఇది న్యాయవిరుద్ధం. అంతేకాక, సినిమాలో మా తాతను నెగిటివ్ రోల్లో చూపించారు. ఆయన చివరి రోజుల్లో దారితద్య్రం అనుభవించినట్టుగా చూపించడం పూర్తిగా తప్పు. వాస్తవానికి ఆయన చివరి వరకు సుఖంగా జీవించారు” అని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై చెన్నై కోర్టు వెంటనే స్పందించింది. దుల్కర్ సల్మాన్‌తో పాటు సినిమా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు జారీ చేసి, నవంబర్ 18లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సినిమా ఇండస్ట్రీ వెనుక జరిగే సంఘటనలు, దర్శకుడు-హీరో మధ్య నడిచే ఈగో క్లాష్‌లను చూపించబోతుంది. సోషల్ మీడియాలో ఇది ఓ కోలీవుడ్ సూపర్ స్టార్ బయోపిక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు, తమిళ సినీ చరిత్రలో తొలి తరం లెజెండరీ హీరో ఎం.కే. త్యాగరాజ భాగవతార్ (M.K.T) అని సమాచారం.
1910లో జన్మించిన మాయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్, తమిళ సినీ పరిశ్రమలో తొలి సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందారు. నటుడిగానే కాక, కర్ణాటిక్ సంగీతకారుడిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1934లో ‘పావలక్కోడి’ సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించి, 14 సినిమాల్లో నటించి, అందులో 10 చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించారు.1944లో విడుదలైన ‘హరిదాస్’ సినిమా మద్రాస్ బ్రాడ్వే థియేటర్లో వరుసగా మూడు సంవత్సరాల పాటు ప్రదర్శింపబడి రికార్డు సృష్టించింది. అయితే అదే ఏడాది ఆయన జీవితాన్ని తలకిందులు చేసిన ఘట్టం చోటుచేసుకుంది.1944లో జర్నలిస్టు సీ.ఎన్. లక్ష్మీకాంతన్ హత్య కేసులో త్యాగరాజ భాగవతార్, హాస్య నటుడు ఎన్.ఎస్. కృష్ణన్, దర్శకుడు ఎస్.ఎం. శ్రీరాములు నాయుడులతో కలిసి ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయ్యారు. దీని వల్ల ఆయన సినీ కెరీర్ పూర్తిగా కూలిపోయింది.30 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయనకి సినిమా అవకాశాలు లేకపోవడంతో భక్తి మార్గాన్ని ఎంచుకొని, దేవాలయాల్లో సంగీత కచేరీలు చేస్తూ జీవితాన్ని గడిపారు. డయాబెటిస్తో బాధపడిన త్యాగరాజ భాగవతార్, చివర్లో ఒక ఆయుర్వేద మందు తీసుకున్న తర్వాత ఆరోగ్యం విషమించి 1959 నవంబర్ 1న మరణించారు.