e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home ఇంటర్వూ థియేటర్‌ వ్యవస్థ మారిపోతుంది!

థియేటర్‌ వ్యవస్థ మారిపోతుంది!

థియేటర్‌ వ్యవస్థ మారిపోతుంది!

‘కుటుంబ బంధాలు, మాస్‌ అంశాలకు హీరోయిజాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిది. వెంకటేష్‌ కెరీర్‌లో విభిన్నమైన సినిమాగా నిలుస్తుంది. అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షను అర్థవంతంగా ఈ సినిమాలో ఆవిష్కరించాం’ అని అన్నారు సురేష్‌బాబు. కలైపులి ఎస్‌ థానుతో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘నారప్ప’. వెంకటేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 20న అమెజాన్‌ప్రైమ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భంగా సురేష్‌బాబు చెప్పిన ముచ్చట్లివి..

సమిష్టి నిర్ణయమిది..
ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయడానికి అనేక కారణాలున్నాయి. ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉంది. పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయో తెలియదు. థియేటర్‌లు తెరిచినా మళ్లీ వైరస్‌ ఉధృతి పెరిగితే నష్టాలు వచ్చే అవకాశముందనే భయాలు తలెత్తాయి. ఆ ఆలోచనతోనే ఓటీటీలో ఈ సినిమాను విడుదలచేయాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం కుటుంబ ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చే పరిస్థితి లేదు. ‘మనమే థియేటర్‌లకు వెళ్లడానికి భయపడుతున్న తరుణంలో మా సినిమా చూడటానికి రమ్మని ప్రేక్షకుల్ని ఎలా ఆహ్వానించగలం?’ అనే ప్రశ్న తలెత్తింది. వాటికి తోడు సెకండ్‌వేవ్‌ తర్వాత ప్రేక్షకులు సినిమాలు చూడటానికి థియేటర్‌లకు వస్తారో?లేదో? అనే అవగాహన లేదు. కరోనా వల్ల చాలా వ్యాపారాలు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఓటీటీలో సినిమాను విడుదలచేయాలనే నిర్ణయం సరైనదనిపించింది. నా నిర్ణయం పట్ట ఎగ్జిబిటర్స్‌ అసంతృప్తితో ఉన్నారని తెలుసు. థియేటర్‌ల కోసం ఎదురుచూస్తూ నిర్మాణభాగస్వామిని ఇబ్బంది పెట్టడం సరికాదనిపించింది.

- Advertisement -

ఒకేసారి ఓటీటీ, థియేటర్‌లో
ఓటీటీ సంస్థలను ఆపేయాలనుకోవడం భ్రమ అవుతుంది. కొవిడ్‌ వల్లే ఓటీటీ ప్రభావం పెరిగింది. ఓటీటీ వల్ల సినీ పరిశ్రమకు చాలా లాభాలున్నాయి. స్టూడియోలకు రెవెన్యూతో పాటు నటీనటులు, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. నిర్మాతలకు లాభాలు వస్తాయి. అయితే ఓటీటీల వల్ల థియేటర్స్‌పై ఆధారపడిన ఎగ్జిబిటర్స్‌ మాత్రం చాలా నష్టపోతున్నారు. భవిష్యత్తులో మన దగ్గర ఓటీటీలలో, థియేటర్‌లలో ఒకేసారి సినిమాలు విడుదల చేసే సంస్కృతి మొదలవుతుంది. గతంలో థియేటర్‌లలో సినిమాను విడుదల చేసిన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలలో ప్రదర్శించాలని థియేటర్‌ వర్గాలు నిర్ణయించాయి. కానీ లాక్‌డౌన్‌ సమయంలో వారం తర్వాతే ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. సాంకేతికత విషయంలో కాలానుగుణంగా వస్తోన్న మార్పులకు తగినట్లుగా నిర్మాతలు, థియేటర్‌ నిర్వాహకుల ఆలోచన ధోరణి మారాలి. అయితే ఓటీటీ ట్రెండ్‌లో థియేటర్‌ వ్యవస్థలో మార్పులొస్తాయి. కానీ థియేటర్‌లు మాత్రం ఎప్పటికీ కనుమరుగుకావు.

హీరోయిజం మాస్‌ అంశాలతో
కమర్షియల్‌ విలువలతో సాగే రియలిస్టిక్‌ చిత్రమిది. వెంకటేష్‌ కెరీర్‌లోనే విభిన్నమైన సినిమాగా నిలుస్తుంది. నిరుపేద రైతుగా వెంకటేష్‌ను ఊహిస్తూ ఇప్పటివరకు ఏ దర్శకుడు కథలు రాయలేదు. ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూస్తారో?లేదో? అనే భయం హీరోల్లో ఉంది. రియలిస్టిక్‌ ఇతివృత్తాల్ని కథానాయకులు అంగీకరించరనే అనుమానం దర్శకుల్లో ఉంది. అందువల్లే ‘అసురన్‌’ లాంటి సినిమాలు తెలుగులో రావడం లేదు. కమర్షియల్‌ అంశాలకు హీరోయిజాన్ని మేళవిస్తూ వెట్రిమారన్‌ అద్భుతంగా ఈ కథను సిద్ధం చేశారు. మాస్‌ అంశాలతో పాటు కుటుంబ బంధాలకు సమప్రాముఖ్యత ఉంటుంది. అంతర్లీనంగా అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అర్థవంతంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కథలో ఆవిష్కరించారు. కులాల మధ్య గొడవల్లా కాకుండా రెండు కుటుంబాల మధ్య వైరుధ్యాల్ని ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా తెరకెక్కించారు. డబ్బు, భూమి ఉంటే లాగేసుకుంటారు. కానీ విద్యను ఎవరూ దోచుకోలేరనే సందేశం ఆకట్టుకోవడంతోనే ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నాం.

ఆ భయం ఉండేది..
నారప్ప పాత్రలో వెంకటేష్‌ పూర్తిగా లీనమై నటించారు. తమిళ్‌ నేటివిటీ ఎక్కువగా ఉన్న కథ ఇది. తెలుగుకు ఎంతవరకు కనెక్ట్‌ అవుతుందోననే భయం ఉండటం వల్లే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా చేశాం. ‘అసురన్‌’ రీమేక్‌ హక్కులను తీసుకున్న తర్వాత ఈ సినిమాను తెరకెక్కించడానికి సరైన దర్శకుడు ఎవరని అన్వేషిస్తున్న సమయంలో ఓ కథ చెప్పడానికి శ్రీకాంత్‌ అడ్డాల మా ఆఫీసుకు వచ్చాడు. ఈ రీమేక్‌ నిర్దేశక బాధ్యతల్ని తాను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు. భావోద్వేగాల్ని బలంగా తెరపై ఆవిష్కరించగల సత్తా ఉండటంతోనే దర్శకుడిగా అతడిని తీసుకున్నాం. శ్రీకాంత్‌ అడ్డాల మాస్‌ సినిమాలు చేయలేదనే కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు.

ఏపీలో కష్టం..
థియేటర్‌లను పునఃప్రారంభించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్‌ రేట్స్‌తో సినిమాల్ని నడిపించడం సాధ్యం కాదు. హౌస్‌ఫుల్స్‌ అయినా కరెంట్‌ బిల్స్‌కు సరిపడా డబ్బులు రావు. వాటికి తోడు లాక్‌డౌన్‌ ఆంక్షలు ఇంకా అమలవుతున్నాయి. కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి ఏపీలో థియేటర్స్‌ తెరవడానికి మరింత సమయం పడుతుందని అనుకుంటున్నా. అయితే తెలంగాణలో మాత్రం వెంటనే థియేటర్‌లను తెరిచే పరిస్థితులున్నాయి.

సొంత ఓటీటీ..
సొంత ఓటీటీ ప్రారంభించాలనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. కానీ భవిష్యత్తులో ఆలోచిస్తా. ఇతరుల భాగస్వామ్యంతో కలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌లో దృశ్యం-2, విరాటపర్వం, దొంగలున్నారు జాగ్రత్త, శాఖిని డాకిని, అహింస చిత్రాల్ని నిర్మిస్తున్నా. వీటిని ఓటీటీ, థియేటర్‌..ఎలా విడుదలచేయాలన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయిస్తాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
థియేటర్‌ వ్యవస్థ మారిపోతుంది!
థియేటర్‌ వ్యవస్థ మారిపోతుంది!
థియేటర్‌ వ్యవస్థ మారిపోతుంది!

ట్రెండింగ్‌

Advertisement