Chandini Chowdary | టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, కలర్ ఫొటో వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందినీ తాజాగా సంతాన ప్రాప్తిరస్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్‌కు మరికొన్ని గంటలే ఉండగా, ఆమె షేర్ చేసిన వీడియో అందరినీ కలచివేస్తోంది. చాందిని షేర్ చేసిన వీడియోలో విశాఖపట్నంలోని వరుణ్ మోటార్స్ షోరూమ్ ముందు కొంతమంది వీధి కుక్కలను పట్టుకుని ట్రాలీలో ఎక్కించే సమయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
కుక్కలను క్రింద నుంచి పైకి విసురుతూ, ఒకటి పై నుంచి కింద పడిపోయినా కూడా అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు వీడియోలో కనిపించే వ్యక్తి. బ్రతికే ఉన్న జీవిని ఓ వస్తువులా వ్యవహరిస్తున్న తీరు చూసి చాందినీ తీవ్ర ఆవేదన చెందింది. నోరు లేని మూగ జీవాలపై ఇంతటి క్రూరత్వమా? అవి కూడా ప్రాణులే అన్న భావన లేకుండా ఇలా విసరడం ఎంత ఘోరం? కనీసం జంతువులపై జాలి, దయలేని సమాజంలో మనం జీవిస్తున్నాం” అంటూ చాందినీ ఆవేదన వ్యక్తం చేసింది. మనుషుల మధ్య కనీసం మానవత్వం కూడా తగ్గిపోతుందనే అంశాన్ని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.
ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగినదని చెప్పిన చాందినీ, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం మున్సిపల్ అధికారులను కోరింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ జంతువులపై ఇలాంటి అమానుష చర్యలను ఖండిస్తున్నారు. సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నప్పటికీ, సమాజ సమస్యలపై తన స్పందనను చాందినీ మరోసారి స్పష్టం చేసింది. చాందినిపై కొందరు నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.