కార్మికుల సమ్మె కారణంగా గత పదహారు రోజులుగా సినిమా షూటింగులు నిలిచిపోయిన విషయం విదితమే. ప్రముఖ నటుడు చిరంజీవితో సోమవారం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు భేటీ కావడం, అదేరోజున ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడు భరత్‌భూషణ్‌తో నిర్మాతలు సమావేశమవ్వడం.. ఈ రెండు సమావేశాలూ మంగళవారం జరుగనున్న చర్చలపై ఆసక్తిని పెంచాయి. నిజానికి మంగళవారం చిరంజీవితో ఇరు వర్గాల భేటీ మరోసారి ఉంటుందని ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ప్రకటించారు. అయితే.. మంగళవారం చిరంజీవితో ఎలాంటి చర్చలూ జరుగలేదు. ఫిల్మ్‌ఛాంబర్‌తో ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యుల సమావేశం మాత్రం సుదీర్ఘంగా జరిగింది. కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో.. 24 శాఖలకు సంబంధించిన 13 యూనియన్లతో విడివిడిగా ఛాంబర్ చర్చించింది.
సమావేశం అనంతరం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మీడియాతో మాట్లాడారు. ‘నిర్మాతలు మా ముందుంచిన వర్కింగ్ కండీషన్ల గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. మా అభిప్రాయాలను క్లియర్‌గా ఫిల్మ్ఛాంబర్కి వినిపించాం. రేపు ఉదయం నిర్మాతలతో కూడా మాట్లాడి, సాయంత్రం 4 గంటలకు అందరికీ ఆమోదయోగ్యమయ్యే ఓ మంచిమాట చెబుతామని ఛాంబర్ సభ్యులు తెలియజేశారు. వేతానాల పెంపు విషయంలోనూ ఛాంబర్ సానుకూలంగానే స్పందించింది. వేతనాలు పెంచేందుకు నిర్మాతలు మినహాయించిన మూడు యూనియన్లకు కూడా వేతనాలు పెంచేందుకు ఛాంబర్ అంగీకరించింది. అయితే.. ఎంత శాతం పెంచేది రేపు తెలుస్తుంది. చిరంజీవిగారితో ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలనూ వివరించాం. బుధవారం ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మంచి కబురును ఆశిస్తున్నాం.’ అన్నారు.