Movie Ban 2025 | 2025లో భారత చలనచిత్ర పరిశ్రమపై సెన్సార్ బోర్డు (CBFC), కేంద్ర ప్రభుత్వం గట్టి నిఘా ఉంచిన విషయం తెలిసిందే. వివాదాస్పద అంశాలతో పాటు, రాజకీయ ఉద్రిక్తతలు, సెన్సార్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈ ఏడాది పలు చిత్రాలు థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. ఇందులో హిందీతో పాటు మలయాళం, తమిళం ఇతర భాష చిత్రాలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది ‘అబీర్ గులాల్’ వంటి చిత్రం దౌత్యపరమైన కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే ఈ ఏడాది విడుదలకు నోచుకోని సినిమాలను ఒకసారి చూసుకుంటే.
1. అబీర్ గులాల్ (Abir Gulal)
పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత వివాదాస్పదంగా మారింది. ఏప్రిల్ 2025లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నటీనటులపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో కేంద్ర ప్రభుత్వం మరియు సినీ కార్మికుల సంఘం (FWICE) పాక్ కళాకారులపై నిషేధం విధించింది. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఇండియాలో బ్యాన్ చేశారు. యూట్యూబ్ నుంచి ఈ సినిమా పాటలను కూడా తొలగించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో విడుదలైనప్పటికీ, మన దేశంలో మాత్రం దీనికి అనుమతి దక్కలేదు.
2. పంజాబ్ ’95 (Punjab ’95)
మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు ఉక్కుపాదం మోపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు దాదాపు 120కి పైగా కట్స్ సూచించింది. దర్శకులు బోర్డు నిర్ణయంతో ఏకీభవించకపోవడం, వివాదం ముదరడంతో ఈ సినిమా విడుదల నిలిచిపోయింది.
3. ఆగ్రా (Agra)
మితిమీరిన బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ సినిమా సెన్సార్ గండం దాటలేకపోయింది. లైంగిక పరమైన సన్నివేశాలు మరియు అసభ్యత ఎక్కువగా ఉన్నాయనే కారణంతో థియేటర్ సర్టిఫికేషన్ నిరాకరించారు. అయితే, ఇది భాష మార్చుకుని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది.
4. షాదీ కే డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్
ఈ చిత్ర టైటిల్ మరియు అందులోని కొన్ని పాత్రలు వ్యక్తిగత విమర్శలను ప్రేరేపిస్తున్నాయనే కారణంతో సెన్సార్ బోర్డు దీనిపై ఆంక్షలు విధించింది.
5. హాల్ (Haal – మలయాళం)
ఈ ఏడాది అత్యంత వివాదాస్పదమైన చిత్రాలలో ఇది ఒకటి. షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ నిరాకరించింది. ఈ సినిమాలో బీఫ్ బిర్యానీ తినే సన్నివేశం ఉండటం, ‘సంఘ్’, ‘ధ్వజ ప్రణామం’ వంటి పదాల వినియోగంపై బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుమారు 15 చోట్ల మార్పులు సూచించడంతో మేకర్స్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కొన్ని రోజులు ఈ సినిమా వాయిదా పడింది. అయితే సెన్సార్ ఇచ్చిన తీర్పుపై కోర్టు మండిపడడంతో తాజాగా సెన్సార్‌ను జారీ చేయగా.. డిసెంబర్ 25న ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది.
6. పరాశక్తి (Parasakthi – తమిళం)
శివకార్తికేయన్ 25వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా కూడా సెన్సార్ కత్తెరకు గురైనట్లు సమాచారం. 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజకీయ అంశాలు తీవ్రంగా ఉన్నాయని బోర్డు భావించింది. అయితే బోర్డు సూచించిన భారీ కట్స్‌ను దర్శకురాలు సుధా కొంగర అంగీకరించలేదు. దీంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపారు. దీనివల్ల 2025 సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది.
ఇంకా ఇవే కాకుండా కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించాల్సిన 19 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రదర్శన అనుమతి నిరాకరించడం సంచలనం సృష్టించింది. వాటిలో ముఖ్యమైనవి:
పాలస్తీనా చిత్రాలు: ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ గాజా’, ‘పాలస్తీనా 36’, ‘ఆల్ దట్స్ లెఫ్ట్ ఆఫ్ యు’ వంటి చిత్రాలకు దౌత్యపరమైన కారణాల రీత్యా అనుమతి దక్కలేదు.
బ్యాటిల్‌షిప్ పొటెమ్కిన్ (Battleship Potemkin): 100 ఏళ్ల నాటి రష్యన్ క్లాసిక్ సినిమాకు కూడా అనుమతి నిరాకరించడం గమనార్హం.
బీఫ్ (Beef – స్పానిష్): ఇది ఒక ర్యాప్ సింగర్ కథ. దీనికి మాంసాహారంతో సంబంధం లేకపోయినా, కేవలం టైటిల్ కారణంగానే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ప్రచారం జరిగింది.
సంతోష్ (Santosh): కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు పొందిన ఈ హిందీ చిత్రానికి కూడా ఇండియాలో స్క్రీనింగ్ అనుమతి రాలేదు.