Superman | భారతీయ సినీ ప్రేక్షకులు సైతం హాలీవుడ్ సినిమాలను ఆదరిస్తుంటారు. ఇటీవల విడుదలైన ‘సూపర్‌మ్యాన్’ చిత్రానికి అభిమానుల నుంచి ఆదరణ పొందుతున్నది. అయితే, చిత్రంలోని 33 సెకన్ల ముద్దు సన్నివేశాన్ని తొలగించడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు ద్వంద ప్రమాణాలపై యూజర్లు మండిపడ్డారు. ఇటీవల ‘F1’ చిత్రం రిలీజ్ సమయంలోనూ సెన్సార్ బోర్డును ట్రోల్ చేశారు. హాలీవుడ్ చిత్రం ‘సూపర్‌మ్యాన్’ మూవీ జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. అయితే, భారత్‌లో 33 సెకన్ల ముద్దు సన్ని వేశాన్ని తొలగించారు. ఈ సన్నివేశంలో సూపర్ మ్యాన్ (డేవిడ్ కోరెన్స్వెట్), లోయిస్ లేన్ (రాచెల్ బ్రోస్నాహన్) పై చిత్రీకరించారు. ఈ మూవీలో ఇద్దరు మధ్య ప్రేమబంధాన్ని డైరెక్టర్ చూపించారు. భారత సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేస్తూ ముద్దు సన్నివేశాన్ని తొలగించింది. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలైంది. సెన్సార్ బోర్డు రూల్స్‌పై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A 13ప్లస్ రేటింగ్ ఇచ్చింది.
13 సంవత్సరాల పిల్లలు వారి తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో సినిమా చూడొచ్చన్నమాట. ఈ ముద్దు సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించడానికి ఇదే కారణం. అయితే, బాలీవుడ్లో అశ్లీల పాటలకు ఎందుకు మినహాయింపు ఇస్తున్నారని పలువురు మండిపడ్డారు. సూపర్‌మ్యాన్ సినిమాలో ముద్దు సన్నివేశాల సెన్సార్‌షిప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమాల్లో చెత్త జోకులకు సైతం అనుమతి ఇస్తున్నారని.. కేవలం ముద్దు సన్నివేశంతో ఏ సమస్య వచ్చింది అంటూ ఓ యూజర్ ఘాటుగా ప్రశ్నించారు. సూపర్‌మ్యాన్ భారతదేశంలో లూయిస్ లేన్‌ను ముద్దు పెట్టుకోవడానికి అనుమతి లేదు.. బాలీవుడ్లో సినిమాల్లో చౌకబారు హీరోలకు హీరోయిన్లను లాగడానికి, తాకడానికి, కొట్టడానికి, కోరుకున్నది చేయడానికి హక్కు ఉంది..! సెన్సార్ బోర్డ్ సీరియస్‌గా ఉందా? అంటూ ప్రశ్నించారు. పలువురు యూజర్లు సెన్సార్ బోర్డు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని.. భారతీయ అభిమానులు సైతం ముద్దు సన్నివేశాలను చూడొచ్చని.. అందులో ఏమీ తప్పులేదంటూ యూజర్లు చెప్పుకొచ్చారు.