సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సెప్టెంబర్ 24న డల్లాస్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ట్రోఫీ, జెర్సీని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సినిమా సక్సెస్ అయినప్పటి కంటే ఆపదలో ఉన్న వారికి ఆదుకున్నపుడు కలిగే సంతృప్తి చాలా గొప్పది. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. ఉద్యమంలా బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి కారణమిదేనన్నారు.
తాము ఉన్నత విద్యలు అభ్యసించకపోయినా ఈ రోజు లక్షల్లో సంపాదిస్తున్నామంటే కారణం సినీ పరిశ్రమ. ప్రేక్షకులు మాకు ఆ అవకాశం కల్పించారు. అలాంటి వారికి ఎంతో కొంత మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిరంజీవి చేసే దానికి ప్రచారం అక్కర్లేదు. కానీ సమాచారం కావాలి కదా..సమాచారాన్ని చూసి పది మంది స్పూర్తి పొందుతారు. వారు ఇంకో పది మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది.
ఏ కార్యక్రమం చేసినా సరే పది మందికి తెలిసేలా చేస్తున్నానన్నారు చిరంజీవి. ఈ సందర్భంగా చిత్రపురి కాలనీలో నిర్మించే ఆస్పత్రి కోసం రూ.20 లక్షల చెక్కును సీసీసీకి అందించారు. ఈ కార్యక్రమంలో నటులు శ్రీకాంత్, తరుణ్, థమన్, సుధీర్ బాబు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.