ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లలో బన్నీవాసు ఒకరు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వేదికగా ఆయన నిర్మించిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకాదరణ చూరగొన్నాయి. ఆయన నిర్మాణ సారథ్యంలో రూపొందిన ‘తండేల్’ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు బన్నీవాసు.
శ్రీకాకుళంలోని బెస్తవాళ్లు గుజరాత్ పోర్ట్‌కి ఫిషింగ్‌కి వెళ్తుంటారు. అక్కడ బోట్లు ఉన్న వాళ్లకి బిరుదులుంటాయి. మెయిన్ లీడర్ని తండేల్ అంటారు. అది గుజరాతీ పదం. తండేల్ అంటే నాయకుడు అని అర్థం. శ్రీకాకుళం జిల్లా మత్సలేశ్యం అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రైటర్ కార్తిక్ ఓ కథ రాసుకున్నారు. అందులోని ఎసెన్స్ నచ్చి, దర్శకుడు చందూ మొండేటిని ఆ కథ వినమన్నాను. తనక్కూడా నచ్చడంతో ఈ సంఘటనలపై రీసెర్చ్ మొదలుపెట్టాం. మత్సలేశ్యం వెళ్లి బాధితుల్ని కలిశాం. వారు చెప్పిన విషయాలు వింటే గూజ్బంప్స్ వచ్చా యి. కచ్చితంగా ఇది చెప్పాల్సిన కథ. జనరంజకంగా చెప్పాలంటే ఓ ప్రేమకథ కూడా అవసరం. అందుకే రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్లను దర్శకుడు చందు డిజైన్ చేశారు. ఆ పాత్రల ద్వారా కథ చెప్పడంతో సినిమాకు నిండుదనం వచ్చింది
ఇది రూటెడ్ స్టోరీ. కల్మషంలేని ప్రేమకథ. అందుకే నేచురల్‌గా షూ ట్ చేశాం. ఇందులో తుపాను ఎపిసోడ్ తప్ప మిగతా సీన్లన్నీ ఒరిజినల్‌గా సముద్రంలోనే షూట్ చేశాం. షామ్ దత్ విజువల్స్ వండర్‌గా అనిపిస్తాయి. ప్రతి షాట్ ఒరిజినల్‌గా ఉంటుంది. ఓవైపు ఫిక్షనల్‌గా అల్లిన ప్రేమకథను చూపిస్తూ దాని ద్వారా వాస్తవ సంఘటనలను తెరపై ఆవిష్కరిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా చందూ ఈ సినిమాను మలిచారు. ప్రేమకథ ఎంతగా ఆకట్టుకుంటుందో.. వాస్తవ సంఘటనలు కూడా అంతగా కట్టిపడేస్తాయి. చందూ అంత మంచి స్క్రిప్ట్ రాశారు.
చైతూకు వినగానే ఈ కథ బాగా నచ్చింది. ‘మనం చేస్తున్నాం’ అనేశారు. అయితే.. ఇది ఫిషర్‌మ్యాన్ క్యారెక్టర్. సముద్రంలోకి వెళ్లిన తర్వాత నెలల తరబడి స్నానం ఉండదు. మనం కూడా అంత రియలిస్టిక్‌గా చూపిస్తేనే బావుంటుందని, యాస కూడా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పాను. ‘నేను వర్క్ చేస్తా..’ అని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఆ పాత్రలో మౌల్డ్ అవ్వడానికి చైతూ చేసిన కృషి అసామాన్యం. సెట్లో చైతూ యాక్టింగ్ చూసి సాయిపల్లవి కూడా అభినందించింది. ‘చైతూ నాకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు’ అని చెప్పి, అందుకు తగ్గట్టు ధీటుగా నటించింది.