కూలీల గురించి అందరికీ తెలుసు. కష్టపడి చమటోర్చి బ్రతుకుతుంటారు. మరి ఆట కూలీల గురించి ఎందరికి తెలుసు? అసలెవరీ ఆట కూలీ?.. అనే విషయానికొస్తే.. ఐపీఎల్లో ఆటగాళ్లను ఎలాగైతే కొనుక్కుంటారో.. అలా కొందర్ని కొనుక్కొని, వాళ్లతో ఆటాడించి, వాళ్లపై బెట్టింగులు కాసి డబ్బు సంపాదించే సంస్కృతి రూరల్‌లో ఉంది. అలా కొనుక్కోబడ్డవాడే ‘ఆట కూలి’. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో రామ్‌చరణ్ ఆట కూలీగా కనిపించనున్నారట. ఇందులో కథ రీత్యా రామ్‌చరణ్ అన్ని ఆటల్లో నిష్ణాతుడై ఉంటాడట. అందుకే.. క్రికెట్, కుస్తీ, కబడ్డీ.. ఇలా అన్ని ఆటలూ ఈ కథలో మిళితమై ఉంటాయట. గ్రాఫిక్స్ జోలికి పోకుండా, గ్రాండియర్‌గా సెట్లేయించేస్తూ ఇప్పటికే కొంతమేర షూట్‌ని బుచ్చిబాబు కానిచ్చేశారట.
దానికోసం నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో దిగ్గజ క్రికెట్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ కీలకపాత్ర పోషించనున్నారట. ధోనీకి జనాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిజంగా ధోనీ ఇందులో భాగమైతే ఈ సినిమా మైలేజీ వేరేలా ఉంటుంది. ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నదట ఈ సినిమా టీమ్. కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం ఏ.ఆర్.రెహ్మాన్, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్.