Brahmanda Movie | తెలంగాణ ప్రజల జీవనశైలికి అద్దంపట్టే జానపద కళల్లో ఒగ్గు కథకీ విశిష్ట స్థానం ఉంది. “ఒగ్గు” అంటే శివుడి చేతిలో ఉండే డమరుకం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇలాంటి గొప్ప సంస్కృతికి అద్దం పట్టేలా రూపొందిన సినిమా బ్రహ్మాండ. ఈ సినిమాను దాసరి సురేశ్ నిర్మించగా, ఎస్. రాంబాబు తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే తను డైరెక్ట్ చేసిన సినిమా ప్రివ్యూ చూస్తుండగా రాంబాబు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తోటి స్నేహితులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణం విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన మరణించినట్టు తెలుస్తుంది. బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామం అల్లీపూర్లో అంత్యక్రియలు నిర్వహించారు.
మొదటి సినిమాతోనే గొప్ప విషయం చెప్పాలన్న ఆ దర్శకుడు, ఇలా అకాల మరణం పొందడం అందరికీ బాధ కలిగించింది. రాంబాబుని మిత్రులు ప్రేమగా నగేష్ అని పిలుస్తుంటారు. ఆయన తాను తెరకెక్కించిన తొలి సినిమాని పెద్ద తెరపై చూస్తున్నంత సేపు చాలా సంతోషంగానే కనిపించారట. కాని హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు. చిత్రంలో బన్నీ రాజు హీరోగా నటించగా, ఆమని, జయరామ్, కనిక వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఒగ్గు కథ ఆధారంగా రూపొందిన సినిమా బ్రహ్మాండతో గొప్ప ప్రయోగం చేశాడు దర్శకుడు. రాంబాబు తెరకెక్కించిన మొదటి సినిమానే ఆయన చివరిది కూడా కావడంతో సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ‘బ్రహ్మాండ’ చిత్ర నిర్మాత దాసరి సురేశ్, నటులు బలగం జయరాం, ఆనంద్ బాల్సద్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని, కుటుంబ సభ్యులకి ధైర్యం అందించారు. రాంబాబు గతంలో సుమారు 150 సినిమాలకు, 60 సీరియళ్లకు కో-డైరెక్టర్‌గా పనిచేసారు. ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’, ‘అన్వేషణ’ వంటి ప్రముఖ సీరియళ్లకు కూడా ఆయన కో-డైరెక్టర్‌గా వ్యవహరించారు.